Minister daughter marriage: తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు కుమార్తె జయకళ్యాణి ఆరోపించారు. తన ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పినట్లు పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు.
సోమవారం బెంగళూరులో సతీశ్ అనే యువకుడితో మంత్రి కుమార్తె వివాహం జరిగింది. అనంతరం దంపతులు పోలీసులను ఆశ్రయించారు. సిటీ కమిషన్ కార్యాలయానికి వెళ్లి.. తన తండ్రి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంత్రి శేఖర్ బాబు అత్యంత సన్నిహితుడు.
"నేను ఈ రోజు సతీశ్‌ను పెళ్లి చేసుకున్నాను. మాది ప్రేమ వివాహం. మా ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు. కొన్ని నెలల క్రితం నన్ను పెళ్లి చేసుకుంటానని సతీశ్ ముందుకు వచ్చారు. అయితే తమిళనాడు పోలీసులు ఆయన్ను రెండు నెలల పాటు అక్రమంగా నిర్బంధించారు. ఇప్పుడు మేము మేజర్లం. ఈ పెళ్లి మా ఇద్దరి సమ్మతి మీదనే జరిగింది. తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని మా తల్లిదండ్రులు బెదిరించారు. కాబట్టి మాకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నాను."