మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో వధువు కావాలని నమోదు చేసి బంగారం, నగదు కోసం మోసాలకు పాల్పడుతున్న భర్త, అతని కుటుంబంపై ఓ వివాహిత ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు.. చెన్నై, ఆవడి పట్టాభిరామ్ ప్రాంతానికి చెందిన నిత్యలక్ష్మి, కోయంబత్తూర్‌కి చెందిన విజయకుమార్‌కి 2020 ఏప్రిల్‌లో వివాహమైంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు. విజయకుమార్ విదేశాల్లో ఉంటూ నిత్యలక్ష్మికి వేర్వేరు నంబర్లతో ఫోన్ చేసి మాట్లాడేవాడు. మూడు నెలల క్రితం నిత్యలక్ష్మికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.
అందులో మాట్లాడిన మహిళ తన పేరు నాథశ్రీ అని, విజయకుమార్ తనని అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు తనని మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పింది. వివరాలు వాట్సప్‌లో పంపించింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన నిత్యలక్ష్మి.. భర్త మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో వధువు కావాలని నమోదు చేసుకుని పదిమందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేశాడని తెలుసుకొంది.