Tamil Nadu fishing festival: తమిళనాడులో చేపల వేట పండగ సందడిగా సాగింది. పుదుక్కొట్టై జిల్లాలో పెద్ద సంఖ్యలో ప్రజలు వలలు పట్టుకొని చేపలు పడుతూ కోలాహలంగా గడిపారు. స్థానికులు ఏటా చేపల పండగను ఘనంగా జరుపుకుంటారు. పంట కోతలు పూర్తైన తర్వాత ఈ వేడుకలు చేసుకుంటారు. గ్రామంలోని ప్రజలంతా ఇందులో పాల్గొంటారు. చెరువులోకి వెళ్లి చేపలు పట్టి చాలా సంతోషంగా పండుగ చేసుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం ఈ వేడుకకు వస్తుంటారు. కులమతాలకు అతీతంగా ఈ వేడుకలు జరుగుతుండటం విశేషం.
అరియలూరు జిల్లాలోనూ ఇలాంటి వేడుకలు నిర్వహిస్తారు. చేపలను పట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని స్థానికులు నమ్ముతారు. పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు. అయితే, పట్టుకున్న చేపలను ఎవరూ విక్రయించరు. వీటిని కొనేందుకూ ఎవరూ ముందుకు రారు. గత రెండేళ్లు కరోనా కారణంగా చేపల పండగకు అధికారులు అనుతులు జారీ చేయలేదు. దీంతో ప్రస్తుత వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివెళ్తున్నారు.