Tamil Nadu Cyclone Michaung : మిగ్‌జాం తుపాను ధాటికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నంచి కుండపోతగా వర్షం కురవడం వల్ల లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ భారీ వర్షాల కారణంగా చెన్నైలో ఇప్పటివరకు 8 మంది మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. భారీ వర్షపాతం కారణంగా సోమవారం రోడ్డు, రైలు, జల, వాయు మార్గాల్లో రవాణా సేవలు స్తంభించాయి. వరద ఉద్ధృతి పెరగడం వల్ల మీనంబక్కం విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 70కిపైగా విమానాలు రద్దవ్వగా, మరో 33 సర్వీసులను బెంగళూరుకు దారి మళ్లించారు. కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోనూ తూపాను ప్రాభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తగ్గిన వర్షాలు, పనరుద్ధరణ పనులు వేగవంతం
మిగ్‌జాం తుపాను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం- నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు సమాచారం. మిగ్‌జాం తుపాన్ కారణంగా ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చెరిలో భారీ నుంచి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు చెన్నైలోని పలు ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖం పట్టడం వల్ల విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నారు. ఇందుకోసం సుమారు 8వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాగా రైలు, బస్సు రాకపోకలను మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు.
సెలవు ప్రకటించిన సీఎం
రాష్ట్రంలో మిగ్‌జాం తుపాను బీభత్సం నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి స్టాలిన్. మంగళవారం నాలుగు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసేలా అనుమతివ్వాలని ప్రైవేట్ సంస్థలను కోరారు స్టాలిన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, సుబ్రమణియన్ పర్యటించారు.