తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైద్యుడి నిర్లక్ష్యం.. వీడియో కాల్ ద్వారా ప్రసవం.. శిశువు సగం బయటకు రాగానే.. - video delivery tamil nadu doctor

ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. వీడియో కాల్ ద్వారా మహిళకు ప్రసవం చేశాడు ఓ వైద్యుడు. అతడి నిర్లక్ష్యం కారణంగా ఓ శిశువు ప్రాణాలు కోల్పోయింది.

baby delivery video call
baby delivery video call

By

Published : Sep 21, 2022, 1:08 PM IST

డ్యూటీలో ఉండాల్సిన వైద్యుడి నిర్లక్ష్యం ఓ శిశువు ప్రాణాన్ని బలితీసుకుంది. పురుటి నొప్పులతో ఆస్పత్రిలో చేరిన మహిళను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. వైద్యుడు ఆస్పత్రిలో లేకపోవడం వల్ల గర్భిణీకి నర్సులే ప్రసవం చేశారు. మధ్యలో విపత్కర పరిస్థితులు ఎదురయ్యేసరికి వైద్యుడిని సంప్రదించారు. అప్పటికీ ఆస్పత్రికి రాని డాక్టర్.. వీడియో కాల్ ద్వారా నర్సులకు సూచనలు చేశాడు. తమిళనాడు చెంగల్పట్టులోని సునంబేడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..
గర్భంతో ఉన్న పుష్ప(33) సునంబేడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఆస్పత్రికే రెగ్యులర్ చెకప్​లకు వెళ్తోంది. సోమవారం (సెప్టెంబర్ 19న) బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. ఇందుకోసం భర్త మురళితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. మహిళను పరీక్షించిన వైద్యుడు.. పురుటి నొప్పులు వచ్చినప్పుడు ఆస్పత్రికి రావాలని చెప్పాడు. ప్రస్తుతానికి ఇంటికి వెళ్లిపోవాలని సూచించాడు. అయితే, అదే రోజు మధ్యాహ్నం పుష్పకు నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అక్కడ నర్సులు తప్ప వైద్యుడు లేడు.

అంతకుముందు నిర్వహించిన పరీక్షల్లో పుష్పకు సమస్యలు ఉన్నట్లు తేలింది. డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అయితే, అవేవీ తెలుసుకోకుండా నర్సులు.. నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. అప్పుడే వీరికి అసలు సమస్య ఎదురైంది. డెలివరీ చేస్తుండగా సాయంత్రం ఆరు గంటల సమయంలో శిశువు కాళ్లు బయటకు రావడాన్ని గమనించారు. దీంతో గర్భంలో శిశువు అడ్డం తిరిగినట్లు నిర్ధరణకు వచ్చారు. వెంటనే వైద్యుడిని సంప్రదించారు.

డాక్టర్.. వీడియో కాల్ ద్వారా నర్సులకు సూచనలు చేశాడు. నర్సులు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ శిశువు తల బయటకు రాలేదు. ఇక చేసేదేం లేక, పుష్పను మదురంతగమ్ జీహెచ్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. పుష్పను అంబులెన్సులో ఎక్కించారు. అయితే, మదురంతగమ్ ఆస్పత్రికి చేరుకునే ముందే శిశువు తల బయటకు వచ్చింది. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బయటకు వచ్చింది మృతశిశువు అని తేలింది.

గ్రామస్థుల నిరసన

ఈ విషయం సునంబేడు వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెద్దఎత్తున స్థానికులు ఆస్పత్రి వద్దకు వచ్చి నిరసనకు దిగారు. వైద్యుడు, నర్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు, వైద్యాధికారులు రంగంలోకి దిగారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. ఘటనకు కారకులైన వారిపై చర్యలు శాఖాపరమైన తీసుకుంటామని వైద్య అధికారులు హామీ ఇచ్చారు.

రోడ్డుపై బైఠాయించిన స్థానికులు
అధికారులకు ఫిర్యాదు చేస్తున్న స్థానికులు

ABOUT THE AUTHOR

...view details