No Caste No Religion Certificate: ఓ బాలిక తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం వారిపై ప్రశంసలు కురిపిస్తోంది. తమ కుమార్తెను ఎవరూ కుల, మతం పరంగా చూడకూడదని.. కేవలం ప్రేమతోనే చూడాలని భావించిన తల్లిదండ్రులకు ఆమెకు అరుదైన ధ్రువపత్రాన్ని తీసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూర్ చెందిన నరేశ్ విజయ్, గాయత్రి దంపతులకు మూడున్నరేళ్ల పాప ఉంది. తమ కుమార్తె విమ్లాను పాఠశాలలో చేర్పించాలని భావించిన వారు.. పలు స్కూళ్లలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అడ్మిషన్ ఫామ్‌లోని కులం, మతం కాలమ్‌లను నింపకుండా ఖాళీగా వదిలేశారు. కానీ ఆ కాలమ్‌లను కచ్చితంగా నింపాల్సిన అవసరం ఉందని, లేదంటే అడ్మిషన్ ఇవ్వలేమని ఆయా స్కూళ్లు స్పష్టం చేశాయి.
పిల్లలను పాఠశాలల్లో చేర్చుకునే సమయంలో మతం, కులం తప్పనిసరి కాదని 1973 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల గురించి తెలియని బాలిక దంపతులు.. తమ సమస్యను పరిష్కరించాలంటూ కోయంబత్తూర్ జిల్లా కలెక్టర్ జి.ఎస్.సమీరన్‌ను సంప్రదించారు. తమిళనాడు రాష్ట్ర విద్యా శాఖ 1973, 2000 నాటి రెండు వేర్వేరు ఉత్తర్వుల ప్రకారం.. 'కులం లేదు, మతం లేదు' అని తల్లిదండ్రులు చెబితే కులం, మతం కాలమ్‌లను ఖాళీగా ఉంచవచ్చు. ఇదే విషయాన్ని కలెక్టర్ సమీరన్ ఆ తల్లిదండ్రులకు తెలియజేశారు. కానీ రిజర్వేషన్ పరంగా ప్రభుత్వం నుంచి పొందే పథకాలు, వెసులుబాటులు అందబోవని స్పష్టం చేశారు.