Tamil Nadu assembly Passes 10 Bills Returned by Governor: బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి డ్రామాలు ఆడుతున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. సుప్రీం కోర్టు జోక్యంతో రవి వెనక్కి పంపిన పది బిల్లులను తమిళనాడు శాసనసభ శనివారం మళ్లీ ఆమోదించింది. దీంతో మరోసారి ఆ బిల్లులు గవర్నర్ వద్దకు వెళ్లనున్నాయి. ఈ బిల్లులను మళ్లీ ఆమోదించేందుకు అసెంబ్లీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఎలాంటి కారణాలు చెప్పకుండా గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను తిరిగి ఆమోదం కోసం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తూ సభ నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలు అన్నాడీఎంకే, బీజేపీ ఎమ్యెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. గతంలో సభ ఆమోదం పొందిన 10 బిల్లులను గవర్నర్.. నవంబర్ 13న తిరిగి వెనక్కి పంపిచారు.
" బీజేపీయేతరరాష్ట్రాలను కేంద్రం కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ బిల్లుల విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వం నుంచి వివరణను కోరవచ్చు. గతంలో కూడా ఇటువంటి జరిగాయి. అలాంటివి ఏమి చేయకుండా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను వెనక్కి తిరిగి పంపడం రాష్ట్ర అసెంబ్లీని గవర్నర్ అవమానించటమే తప్ప మరొకటి లేదు. గవర్నర్.. రాష్ట్ర ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు."
--స్టాలిన్, సీఎం