శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుని ఎంజీఆర్ రికార్డును సమం చేయాలని ఉవ్విళ్లూరిన అన్నాడీఎంకే ఆశలు అడియాసలయ్యాయి. పళనిస్వామి ప్రభుత్వంపై అంతగా వ్యతి రేకత లేకున్నా.. పార్టీలోని అంతర్గత విభేదాలు, భాజపాతో చెలిమి, కనిపించని శశికళ ప్రభావం తదితర కారణాలు అన్నాడీఎంకేకు అధికార పీఠాన్ని దూరం చేశాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత లేని వేళ పార్టీ వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగని కారణంగానే ఓటమి చవి చూసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వర్గ పోరే ముంచేసిందా..?
తమిళనాడు ఎన్నికల్లో ఎప్పుడైనా వార్ వన్‌సైడే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ ఎన్నికల్లో ఆధిక్యం ప్రదర్శించిన డీఎంకేకు అన్నాడీఎంకే ఎదురొడ్డి నిలిచి, గట్టి పోటీనే ఇచ్చిందని చెప్పాలి. ప్రజల్లో గట్టి ముద్ర వేసుకున్న అన్నాడీఎంకేను ఈ ఎన్నికల్లో వర్గ పోరే ముంచేసిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత అన్నాడీఎంకే అగ్రనేతలు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం రెండు వర్గాలుగా విడిపోయారు. వీరిద్దరు పైకి కలిసి ఉన్నట్లు కనిపించినా.. తమ మద్దతుదారులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అన్నా డీఎంకే కూటమి గెలిస్తే తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. అసంతృప్తిని వీడి అధికార పీఠాన్ని దక్కించుకునే కోణంలో ఎవరూ ప్రయత్నించలేరన్న విమర్శలున్నాయి.
భాజపాపై వ్యతిరేకతతో గండి!
2016 శాసనసభ ఎన్నికల్లో భాజపాతో కూటమి ఏర్పాటుకు జయలలిత నిరాకరించారు. ఈ నేపథ్యంలో గత లోకసభ, ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీతో పళనిస్వామి, ఓ. పన్నీర్ సెల్వం పొత్తు పెట్టుకోవడం అన్నాడీఎంకే శ్రేణులకు మింగుడుపడలేదు. అందుకే ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల ప్రచారంలో అన్నాడీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థుల ప్రచారంలోనూ భాజపా కార్యకర్తలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షా, వంటి భాజపా అగ్రనేతలు ఎన్నికల్లో ప్రచారం చేసినా అన్నాడీఎంకే అభ్యర్థులకు మాత్రం విజయం వరించలేదు.
నీట్, నూతన జాతీయ విద్యావిధానం, కొత్త సాగుచ ట్టాలు, తూత్తుకుడిలో స్టెరిలైట్ రాగి పరిశ్రమకు నిరసనగా పోరాడిన వారిపై తుపాకీ కాల్పులు వంటి పలు ఘటనలతో కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని అన్నాడీఎంకే విషయంలో తమిళులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకతే అన్నాడీఎంకే విజయానికి గండికొట్టారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ ఓటర్ల మదిలో అమ్మ ఉన్నారనీ, ఆ అభిమానంతోనే అన్నాడీఎంకే 80 స్థానాల వరకు గెలుచుకుందని అంచనా వేస్తున్నారు.
పరాజయానికి మరికొన్ని కారణాలివీ..
- అన్నాడీఎంకేలో సమర్థ నాయకత్వం కరవైందన్న విమర్శలు ఉన్నాయి.
- జయలలిత మృతి చెందిన తరవాత శశికళే పార్టీలో కీలకపాత్ర పోషించి నాయకులు, కార్యక ర్తలకు దిశానిర్దేశం చేస్తారని భావించారు. డీఎంకేను ఓడించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన శశికళ.. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండటమూ పార్టీ విజయాన్ని దూరం చేసింది.
- శశికళ సమీప బంధువు దినకరన్ ఏఎంఎంకే పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో వేరుగా పోటీ చేశారు. ఈ పార్టీ అభ్యర్థులు జయలలిత ఫొటో లతో ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో అన్నాడీఎంకేకు ఓట్లు చీలాయని పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి:మినీ సార్వత్రికంలో మెరవని సినీ తారలు!