తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విజయ్ 'సైలెంట్​ పాలిటిక్స్'​- ఆ ఎన్నికల్లో 100 మంది గెలుపు

అధికారిక ప్రకటన చేయకుండానే... స్టార్​ హీరో విజయ్​ 'రాజకీయాలు' మొదలుపెట్టారా? పార్టీ స్థాపించకుండానే.. అభిమాన సంఘం ద్వారానే 'అన్నీ' నడిపిస్తున్నారా? ఔననే అంటున్నాయి తమిళ రాజకీయ వర్గాలు. ఇటీవల జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ ఫ్యాన్స్​ అసోసియేషన్​ సభ్యులు 100 మందికిపైగా గెలవడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నాయి. అతి త్వరలో జరిగే మరో 'కీలక పోరు'కు విజయ్​ సేన సిద్ధమవుతున్నట్లు విశ్లేషిస్తున్నాయి.

Actor Vijay
విజయ్

By

Published : Oct 14, 2021, 11:39 AM IST

తమిళనాడులో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో(Tamil Nadu Local Body Election 2021) స్టార్​ నటుడు విజయ్ అభిమానుల సంఘం ఉనికి చాటుకుంది. 'విజయ్ మక్కల్​ ఇయక్కమ్​'(Vijay Makkal Iyakkam) తరఫున పోటీ చేసిన 169 మందిలో 100 మందికిపైగా గెలుపొందారు. కాంచీపురం, చెంగల్పట్టు, కాళ్లకురిచి, విల్లుపురం, రాణిపేట్, తిరుపత్తూర్​, టెంకాశీ, తిరునెల్వేలి జిల్లాల్లో వీరు సత్తా చాటారు. తమిళనాడులో అక్టోబర్​ 6-9 మధ్య వేర్వేరు గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి 27,003 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే(DMK Party) పూర్తిస్థాయి ఆధిక్యం కనబరచగా.. ప్రతిపక్ష అన్నాడీఎంకే 25శాతం కన్నా తక్కువ స్థానాలకు పరిమితమైంది. దిగ్గజ నటుడు కమల్​ హాసన్​కు(Kamal Haasan Political Party) చెందిన మక్కల్ నీది మయ్యమ్​(Makkal Needhi Maiam) ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

పక్కా వ్యూహంతో విజయ్!

విజయ్​ రాజకీయ అరంగేట్రం ఖాయమని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు శాసనసభ ఎన్నికల ముందు కూడా ఇదే అంశంపై విస్తృత చర్చ జరిగింది. అయితే.. ఆ ఎన్నికలకు దూరంగా ఉన్న విజయ్... ఇప్పుడు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను ఓ ప్రయోగంగా భావించారని సమాచారం. ఈ ఎన్నికల్లో 'విజయ్​ మక్కల్​ ఇయక్కమ్​' సభ్యులు నామినేషన్లు వేసేందుకు, ప్రచారంలో తమ అభిమాన నటుడి పేరు, ఫొటో, ఫ్యాన్స్​ అసోసియేషన్ జెండా(Vijay Makkal Iyakkam Flag) ఉపయోగించుకునేందుకు ఆయనే అనుమతి ఇచ్చారని తెలిసింది.

విజయ్ మక్కల్​ ఇయక్కమ్ అభిమానుల సంఘం లోగో

ఈ ఎన్నికల్లో 100 మందికిపైగా సభ్యులు గెలవడం 'విజయ్​ మక్కల్​ ఇయక్కమ్​'(Vijay Makkal Iyakkam Group) వర్గాల్లో ఆనందం నింపింది. ఇదే ఉత్సాహంతో తమిళనాడులో మరికొద్ది నెలల్లో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వారిని పోటీకి దింపాలని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం.

తండ్రితో గొడవ!

విజయ్​కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 'అఖిల భారత తలపతి విజయ్​ మక్కల్​ ఇయక్కమ్​'(All India Thalapathy Vijay Makkal Iyakkam) ఫ్యాన్​ క్లబ్​ కూడా ఉంది. ఇదే పేరుతో గతేడాది పార్టీ స్థాపించారు విజయ్​ తండ్రి, డైరక్టర్​ ఎస్​ఏ చంద్రశేఖర్​. ఈ వార్త సంచలనం సృష్టించింది.

కొన్నిరోజులకే విజయ్ వైపు నుంచి ఓ ప్రకటన వచ్చింది. "మా నాన్న పెట్టిన పార్టీతో నేరుగా, పరోక్షంగా గానీ నాకు సంబంధం లేదు. మా నాన్న పార్టీ పెట్టారని నా అభిమానులు ఎవరూ అందులో చేరొద్దు" అని విజయ్ తన నోట్​లో పేర్కొన్నారు. పార్టీ కోసం తన పేరు, ఫొటో, ఫ్యాన్స్​ క్లబ్​ను గానీ దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఇదే విషయమై... తన తల్లిదండ్రులు సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో ఈ ఏడాది సెప్టెంబర్​లో కేసు పెట్టారు విజయ్. అనుమతి లేకుండా తన పేరు ఉపయోగిస్తున్నారని, అలా జరగకుండా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఇప్పటికే ఎంతో మంది..

తమిళనాడులో అగ్ర నటీనటులు రాజకీయ అరంగేట్రం చేయడం ఇదే తొలిసారేం కాదు. ఎంజీఆర్ మొదలుకొని జయలలిత వరకు సినీ నేపథ్యంతో సంబంధం ఉన్న వ్యక్తులే తమిళనాడును పాలిస్తూ వచ్చారు. మరోవైపు విశ్వనటుడు కమల్​హాసన్(Kamal Haasan Political Party) ఇప్పటికే పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసి 5 శాతం ఓట్లను సాధించారు. అయితే.. ఇటీవల తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మాత్రం కమల్​కు నిరాశే మిగిలింది.

కోలీవుడ్​లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విజయ్​కు తమిళనాడుతో పాటు కేరళలో భారీగా అభిమానులు ఉన్నారు. విజయ్ నటించిన పలు సినిమాలు సైతం రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. 'మెర్సెల్' చిత్రంలో జీఎస్టీ, నోట్ల రద్దుపై విమర్శలు చేయడం భాజపాకు ఆగ్రహం కలిగించింది. మరోవైపు సర్కార్ చిత్రంలో శశికళ గురించి ప్రస్తావించడంపై అన్నాడీఎంకే మండిపడింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details