తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతు దీక్ష: కొలిక్కిరాని చర్చలు- 9న మరో భేటీ - రైతుల చర్చల

దిల్లీలో నిరసన చేస్తున్న రైతు నాయకులు, కేంద్రం మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. డిమాండ్లపై రైతు సంఘాలు పట్టు వీడని నేపథ్యంలో ఐదో భేటీలోనూ పరిష్కారం దొరకలేదు. డిసెంబర్ 9న మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు.

Farmers' protest: 5th round of talks between farmers, Centre to be held today
రైతు దీక్ష: కొలిక్కిరాని చర్చలు- 9న మరో భేటీ

By

Published : Dec 5, 2020, 7:20 PM IST

Updated : Dec 5, 2020, 9:11 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో పది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులను శాంతింపజేసేందుకు కేంద్ర మంత్రుల బృందం నిర్వహించిన ఐదో విడత సమావేశాలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. ఈ నెల 9న మరోసారి సమావేశం కావాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి.

శనివారం దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, ఆహార శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌.. రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని, లేకుంటే భేటీ నుంచి వాకౌట్‌ చేస్తామని రైతు ప్రతినిధులు హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలు ప్రభుత్వానికి తప్ప రైతులకు ఎలాంటి మేలు చేయబోవని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ వ్యవసాయాన్ని కోరుకోవడం లేదని తెలిపారు.

"మా డిమాండ్లకు ఎస్‌ లేదా నో ఏదో చెప్పాలని కోరాం. మంత్రి సోంప్రకాశ్‌ మా వద్దకు వచ్చారు. పంజాబ్‌ కోసం మంత్రి పదవి వదులుకోవాలని కోరాం. దండలేసుకొని మా ఆందోళనలో పాల్గొనాలని కోరాం. ఆ తర్వాత మరోవిడత చర్చలకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిరోజు చర్చలకు రావటం సాధ్యం కాదని చెప్పాం. 8న కలుద్దామన్నారు. ఆ రోజు భారత్‌ బంద్‌ ఉన్నందున రాలేమని, 9న వస్తామని చెప్పాం."

-రైతు సంఘం ప్రతినిధి

ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలను కొనసాగించడానికి తమ వద్ద ఏడాదికి సరిపడా సరుకులు ఉన్నాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం తమను రోడ్లపైనే ఉంచాలని చూస్తే అభ్యంతరం ఏమీ లేదని స్పష్టం చేశారు.

'అనుమానాలు నివృత్తి చేస్తాం'

ఈ సందర్భంగా వృద్ధులు, చిన్నారులను నిరసన వేదిక నుంచి ఇంటికి తీసుకువెళ్లాలని వ్యవసాయ మంత్రి తోమర్..‌ రైతు ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఎంపీఎంసీ చట్టం రాష్ట్రాల పరిధిలోనిదని స్పష్టం చేశారు.

"రైతుసంఘాల ప్రతినిధులతో ఐదోవిడత చర్చలు పూర్తయ్యాయి. ఎం.ఎస్‌.పి. కొనసాగుతుందని చెప్పాం. ఎం.ఎస్‌.పి.కి ఎలాంటి హానీ లేదు. ఆపై అనుమానాలకు ఎలాంటి తావులేదు. ఎంపీఎంసీ చట్టం రాష్ట్రాల పరిధిలోని అంశం. రాష్ట్రాల్లోని మార్కెట్లను ప్రభావితం చేసే ఆలోచన కేంద్రానికి లేదు. ఎంపీఎంసీ మార్కెట్లపై ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

-నరేంద్రసింగ్ తోమర్‌, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

మద్దతు ధరపై ఆందోళన

45 పంటలకు మద్దతు ధర ఉన్నా అందులో 94 శాతం పంటలకు రైతులకు మద్దతు ధర రావడం లేదని కేంద్రానికి వివరించారు. రైతులు పండించే పంటలను మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసేవారిని అరెస్ట్ చేసి ఐదేళ్ల పాటు జైల్లో ఉంచాలని డిమాండ్ చేశారు.

కాగా.. పంటలకు మద్దతు ధర కొనసాగింపుపై లిఖిత పూర్వక హామీ ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. డిసెంబర్ 8న భారత్ బంద్​ను వాయిదా వేయాలని రైతులను కోరింది. అయితే, వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం సహా తమ డిమాండ్లను ఒప్పుకుంటే వెంటనే ఆందోళనలు విరమిస్తామని రైతులు స్పష్టం చేశారు.

Last Updated : Dec 5, 2020, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details