కొవిడ్ సమయంలో అనాథ పిల్లలను అక్రమంగా దత్తత తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్)కు రాష్ట్రాలు సమర్పించిన డేటా ఆధారంగా ఈ ఏడాది జూన్ 5 నాటికి కరోనా వల్ల 30 వేల మందికిపైగా పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయినట్లు పేర్కొంది.
అనాథలుగా మారిన లేదా తల్లిదండ్రులను కోల్పోయిన లేదా విడిచిపెట్టిన మైనర్ల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం.. అనాథలను దత్తత తీసుకోవటానికి ఆహ్వానించడం చట్ట విరుద్ధమని పేర్కొంది. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ప్రమేయం లేకుండా దత్తత తీసుకోవటానికి అనుమతి లేదని తెలిపింది.