Taj Mahal 22 rooms case:తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదులను తెరవాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్ కొట్టేసింది. తాజ్‌మహల్‌లోని 22 గదుల్లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ భాజపా యువజన విభాగం మీడియా ఇంఛార్జ్ రజనీశ్ సింగ్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఆ గుట్టు తేల్చడానికి గదులను తెరిచేలా భారత పురావస్తు శాఖ అధికారులను ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఈ విషయంపై నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు. అనంతరం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో దీనిపై నివేదిక ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, అలహాబాద్ హైకోర్టు.. పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. 'రేపు మీరు వచ్చి మా ఛాంబర్లను చూడటానికి అనుమతి అడుగుతారు. దయచేసి పిల్ వ్యవస్థను అపహాస్యం చేయొద్దు. ఈ అంశాన్ని చరిత్రకారులకు వదిలేద్దాం' అని వ్యాఖ్యానించింది.
Taj Mahal 22 rooms history:తాజ్‌మహల్‌పై హిందూ వర్గాల్లో జరుగుతున్న విస్తృత ప్రచారాన్ని కోర్టు ముందు ఉంచిన పిటిషనర్ ప్రస్తుత తాజ్‌మహల్ స్మారకం ఒకప్పుడు శివాలయమన్న హిందూ సమూహాల వాదనలను ప్రస్తావించారు. కొన్ని హిందూ సమూహాలు ఇప్పటికీ శివుడి తేజో మహాలయంగా తాజ్‌మహల్‌ను విశ్వసిస్తున్నారని కోర్టుకు గుర్తుచేశారు. నాలుగు అంతస్తులు ఉన్న తాజ్‌మహల్‌లో ఎగువ.. దిగువ భాగాల్లో సుమారు 22 గదులు మూసి ఉన్న స్థితిలో ఉండటాన్ని పిటిషనర్ కోర్టుకు గుర్తు చేశారు.