Syed Fazal ul Hasan Story: యునైటెడ్ ప్రావిన్స్‌లోని (ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్) ఉన్నావ్ జిల్లా మోహన్ గ్రామంలో 1875లో జన్మించిన ఫజల్ ఉల్ హసన్...తన ఊరిపేరునే కలం పేరుగా మార్చుకొని హస్రత్ మొహానిగా పేరొందారు. మహమ్మదీన్ ఆంగ్లో ఓరియెంటల్ కాలేజీ (ప్రస్తుత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ) నుంచి పట్టభద్రుడైన ఆయన ఆది నుంచీ ఆంగ్లేయులను విమర్శించేవారు. దీంతో కాలేజీ నుంచి మూడుసార్లు బహిష్కరణకు గురయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా బ్రిటిష్‌వారికి గులాంగిరీ చేయనంటూ.. జర్నలిస్టుగా మారారు. ఉర్దూ -ఎ- ముల్లా అనే మేగజీన్ నడిపారు. జాతీయ కాంగ్రెస్‌లో చేరి.. అరబిందో ఘోష్, బాల గంగాధర్ తిలక్‌ల బాటలో నడిచి అతివాదిగా ముద్రవేసుకున్నారు. ఆయన భార్య బేగం నిషాతున్నీసా కూడా అదే బాటలో పయనించారు. బ్రిటిష్ సర్కారును విమర్శిస్తూ రాసినందుకు భర్తను ఆంగ్లేయులు అరెస్టు చేస్తే ఆమే మేగజీన్ నడిపించారు. ముస్లింలీగ్ ఏర్పడ్డాక అందులోనూ చేరిన మొహానీ 1919లో దాని అధ్యక్షుడయ్యారు. ముస్లింలీగ్‌లో ఉంటూనే కాంగ్రెస్‌లో కూడా కొనసాగిన ఆయన 1921 అహ్మదాబాద్ సదస్సులోనే సంపూర్ణ స్వరాజ్యం కోసం తీర్మానం చేయాలని పట్టుబట్టారు. అప్పుడే ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించారు. నిషాతున్నీసా కూడా భర్త బాటలో సంపూర్ణ స్వరాజ్యం కోసం పట్టుబట్టారు. అప్పటికి కాంగ్రెస్ ఇంకా స్వయం ప్రతిపత్తిని మాత్రమే కోరుతోంది. మొహానీ దంపతుల చొరవ, పట్టుదలను గాంధీజీ మెచ్చుకున్నారు. అయితే మరో 8 సంవత్సరాలకుగాని కాంగ్రెస్ ఈ తీర్మానం ఆమోదించలేదు.
జిన్నాతో వాదించి..
కాంగ్రెస్ తీరు నచ్చని మొహానీ 1925లో ఏర్పడ్డ భారత కమ్యూనిస్టు పార్టీ వైపు మొగ్గు చూపారు. సీపీఐ వ్యవస్థాపకుల్లో ఒకరిగా వ్యవహరించారు. తర్వాతికాలంలో వారితో సైద్ధాంతిక విభేదాలు వచ్చి బయటకు వచ్చేశారు. కానీ ఆయన ఆలోచనలు మాత్రం విప్లవాత్మకంగానే సాగేవి.