swine flu in Ranchi: ఝార్ఖండ్ రాజధాని రాంచీలో మూడు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. బాధితులను రాంచీలోని భగవాన్ మహావీర్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మరో ఇద్దరు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, వారికి సంబంధించిన రిపోర్టులు సోమవారం వస్తాయని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
రాంచీకి చెందిన 37 ఏళ్ల మహిళకు, ధన్‌బాద్‌కు చెందిన 56 ఏళ్ల మహిళకు, బంగాల్లోని పురులియాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి స్వైన్‌ఫ్లూ నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు. రోగులు మొదట కొవిడ్ పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. అయితే వారికి వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానం రావడం వల్ల పరీక్షలు చేయగా.. స్వైన్ ఫ్లూగా తేలిందని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ విజయ్ మిశ్రా పేర్కొన్నారు.
"రోగులకు ఎటువంటి ప్రయాణ చరిత్ర లేదు. పలువురు రోగులు కొవిడ్ లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్నారు. టెస్టుల్లో నెగెటివ్‌గా వచ్చిన సమయంలో తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. అయితే కొవిడ్ లక్షణాలు ఉండి.. నెగెటివ్ వచ్చిన వారంతా స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే మరింత మందికి స్వైన్‌ఫ్లూ సోకుతుంది."
-విజయ్ మిశ్రా, భగవాన్ మహావీర్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్
మరోవైపు, రాంచీలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం సృష్టిస్తోంది. జులై 27 నుంచి ఇప్పటి వరకు 800కు పైగా పందులు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వల్ల మరణించాయని అధికారులు తెలిపారు. భారత్‌లో మొదటి సారిగా అసోంలో ఆఫ్రికన్ స్వైన్ పీవర్ కేసులు బయటపడ్డాయి.