తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వీనస్' కోసం భారత్​, స్వీడన్ స్నేహగీతం - శుక్రయాన్​లో స్వీడన్

శుక్ర గ్రహంపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టే శుక్రయాన్ మిషన్​లో స్వీడన్ భాగం కానున్నట్లు ఆ దేశ రాయబారి తెలిపారు. కీలకమైన పరికరాన్ని ప్రయోగం కోసం సమకూర్చనున్నట్లు వెల్లడించారు. అంతరిక్ష రంగంలో భారత్​తో భాగస్వామ్యం కొనసాగించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Sweden getting on board India's Venus mission with payload to explore planet
'శుక్రయాన్' మిషన్​లో స్వీడన్ భాగస్వామ్యం

By

Published : Nov 25, 2020, 1:04 PM IST

శుక్ర గ్రహంపై పరిశోధన కోసం భారత్ చేపట్టనున్న 'వీనస్' మిషన్​లో స్వీడన్​ భాగం కానుంది. భారత్​లోని స్వీడన్ రాయబారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇస్రోతో కలిసి స్వీడన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ ఫిజిక్స్​(ఐఆర్ఎఫ్) కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు. ఇస్రోతో ఐఆర్ఎఫ్ భాగస్వామ్యం కావడం ఇది రెండోసారని తెలిపారు. శుక్రయాన్ కోసం శాస్త్రీయ పరికరాన్ని స్వీడన్ అందించనున్నట్లు స్పష్టం చేశారు.

"సూర్యుడి నుంచి వెలువడే కణాలు గ్రహంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఐఆర్ఎఫ్ ఉపగ్రహ పరికరం వీనసియన్ న్యూట్రాల్స్ అనలైజర్(వీఎన్ఏ) గుర్తిస్తుంది. వీనస్ మిషన్ ద్వారా ఐఆర్ఎఫ్, ఇస్రో మధ్య భాగస్వామ్యం కొనసాగుతుంది."

-క్లాస్ మోలిన్, భారత్​లోని స్వీడన్ రాయబారి

అంతరిక్ష రంగంలో భారత్​తో భాగస్వామ్యం కావడంపై కీలక వ్యాఖ్యలు చేశారు మోలిన్. అంతరిక్ష సాంకేతిక సంస్థల ద్వారా భారత్​కు విశేష సహకారం అందించే అవకాశం తమకు ఉందని చెప్పారు. ఇతర గ్రహాలతో పాటు విశ్వాన్ని పూర్తిగా అన్వేషించాలని భారత్ స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుందని అన్నారు. మనుషులను అంతరిక్షంలోకి పంపేందుకు భారత్ కృషి చేయడాన్ని స్వాగతించారు.

భారత్​తో భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులపై స్పందించారు మోలిన్. ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌, ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌(ఇన్-స్పేస్) ఏర్పాటుతో ఈ రంగంలో ప్రైవేటు కంపెనీలకు ప్రయోజనాలు కల్పించే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఈ సంస్కరణల ఫలితంగా ప్రైవేటు భాగస్వామ్యం పెరిగి అంతరిక్ష కార్యకలాపాలు మెరుగవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ఎగుమతులు-దిగుమతులపై ఆంక్షలు తగ్గించడం, ఉపగ్రహాల అభివృద్ధిలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతించడం, వాణిజ్యపరమైన వ్యక్తులకు అంతరిక్ష మార్కెట్​లో భాగస్వామ్యం కల్పిస్తూ భారత్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంది. మార్కెట్ వృద్ధి విశేషంగా ఉంటుంది."

-క్లాస్ మోలిన్, భారత్​లోని స్వీడన్ రాయబారి

శుక్ర గ్రహ అన్వేషణ కోసం వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో 20 అంతరిక్ష ప్రయోగాలను సంక్షిప్త జాబితాగా రూపొందించింది ఇస్రో. రష్యా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ దేశాల సంయుక్త భాగస్వామ్యంతో వీటిని చేపట్టనుంది. ఫ్రాన్స్​కు చెందిన వైరల్ పరికరాన్ని(వీనస్ ఇన్ఫ్రాడెడ్ అట్మాస్పియర్ గ్యాస్ లింకర్) శుక్ర గ్రహ ప్రయోగం కోసం ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ప్రయోగ తేదీ మార్పు!

2023 జూన్​లో శుక్ర గ్రహ ప్రయోగం చేపట్టాలని ఇస్రో తొలుత భావించింది. అయితే కరోనా వల్ల ఈ తేదీల్లో మార్పులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 2024 లేదా 2026లో ప్రయోగం జరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

శుక్ర గ్రహం ఉపరితలాలు, నిస్సార ఉపరితలాలతో పాటు వాతావరణ తీరుతెన్నులపై పరిశోధన చేపట్టనుంది ఇస్రో. ఉపగ్రహ ప్రయోగం కోసం జీఎస్​ఎల్​వీ ఎంకే 2 రాకెట్​ను ఉపయోగించనుంది. శుక్ర గ్రహానికి 500x60 వేల కిలోమీటర్ల కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details