Manipur Incident : మణిపుర్‌లో వివస్త్రకు గురైన మహిళను దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పరామర్శించారు. ఇంఫాల్‌లో బాధితురాలిని కలుసుకున్న స్వాతి మలివాల్... దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. శనివారం నుంచి మణిపుర్‌లో పర్యటిస్తున్న ఆమె... లైంగిక దాడికి గురైన మహిళలను కలుసుకునేందుకు బీరెన్ సింగ్ సర్కారు అనుమతించడం లేదని ఆరోపించారు. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించడానికి మణిపుర్ ప్రభుత్వం అనుమతించాలని కోరారు
Myanmar Manipur Border : మైతేయ్, గిరిజన తెగల మధ్య వైరం కారణంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న మణిపుర్‌లో మరో సమస్య తలెత్తింది. మయన్మార్ నుంచి 718 మంది అక్రమంగా మణిపుర్‌లో ప్రవేశించారు. వీరిలో 301 మంది పిల్లలు, 208 మహిళలు, 209 మంది పురుషులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జులై 22, 23 తేదీల్లో వీరంతా సరైన ప్రయాణ పత్రాలు లేకుండా మణిపుర్‌లో ప్రవేశించినట్లు వెల్లడించాయి. వీరందరినీ వెనక్కి పంపేయాలని అసోం రైఫిల్స్‌కు మణిపుర్ ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మయన్మార్ వాసులను మణిపుర్‌లోకి అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అసోం రైఫిల్స్‌కు తెలియజేసినట్లు మణిపుర్ చీఫ్ సెక్రటరీ డా. వినీత్ జోషి తెలిపారు.
మణిపుర్‌లో ఆందోళనకారులకు మయన్మార్ నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు గత నెలలో ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇలా ఆయుధాలు సరఫరా చేస్తున్న నలుగురిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఈ క్రమంలో మయన్మార్ వాసులు మణిపుర్‌లోకి ప్రవేశించడంపై మణిపుర్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్, మణిపుర్‌కు మధ్య 398 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వద్ద హెలికాప్టర్లతో నిఘా ఉంచుతున్నారు
Manipur Violence : మరోవైపు హింసాత్మక ఘర్షణలతో నలిగిపోతున్న మణిపుర్ బాధితులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా ప్రజలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. మిజోరం ప్రజలు భారీ ర్యాలీలు నిర్వహించారు. మిజోరం రాజధాని ఐజ్వాల్ సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలు, ఎన్జీవోలు నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో వేలాదిమంది పాల్గొన్నారు. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా రహదారులపైకి వచ్చి శాంతియుత ఆందోళనలు నిర్వహించారు. CM జొరమ్‌తంగా, డిప్యూటీ CMతో సహా, అధికార విపక్ష MLAలు ప్రజలతో కలిసి అడుగేశారు. సరిహద్దు రాష్ట్రమైన మణిపుర్‌లో ఘర్షణలు సద్దుమణిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను నిజంగా భారతీయులుగా చూస్తే ఇప్పటికైనా స్పందించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. స్త్రీలను వివస్త్రలు చేసిన నిందితులకు కఠినశిక్ష విధించాలని కోరారు. కాగా మిజోరంలో ఇటీవలి కాలంలో ఇంతటి భారీ ర్యాలీలు జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి.
మణిపుర్ ఇంటర్నెట్ బ్యాన్ ఎత్తివేత
మణిపుర్‌లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలపై విధించిన నిషేధాన్ని కొన్ని షరతులతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బీరెన్ సింగ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మెుబైల్ ఇంటర్నెట్ సేవలపై మాత్రం నిషేధం కొనసాగుతుందని తెలిపింది. స్థిరమైన ఐపీ కనెక్షన్లకు మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందుతాయని మణిపుర్ హోంశాఖ పేర్కొంది. అనుమతించిన కనెక్షన్లు మాత్రమే వినియోగదారులు తీసుకోవాలని లేనిపక్షంలో.. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ద్వారా ఆయా వ్యవస్థలు, రౌటర్లను ఉపయోగించే వైఫై హాట్‌స్పాట్ సేవలకు అనుమతి లేదని వెల్లడించింది. ఇంటర్నెట్‌పై నిషేధంతో ఆన్‌లైన్ చెల్లింపులకు, వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కొన్ని షరతులతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను పునరుద్ధరించినట్లు మణిపుర్ హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవీ చదవండి :మణిపుర్ అమానుష ఘటనపై కుకీల భారీ ర్యాలీ.. న్యాయం కోసం డిమాండ్
మణిపుర్ వీడియో కేసులో ఐదో నిందితుడు అరెస్ట్.. మిగతా వారికోసం అణువణువూ గాలింపు!