తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేంద్ర సాగు చట్టాలు విలువ కోల్పోయాయి' - ఈటీవీ భారత్​తో యోగేంద్ర యాదవ్​ ఇంటర్వ్యూ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న సుదీర్ఘ ఆందోళన తప్పకుండా విజయం సాధిస్తుందని స్వరాజ్‌ ఇండియా వ్యవస్థాపకుడు, రైతు నేత యోగేంద్ర యాదవ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనలు సాగుతున్న క్రమం, దీనిపై ప్రభుత్వ వైఖరి.. తదితరాలపై ఆయన 'ఈటీవీ భారత్‌'తో మాట్లాడారు.

yogendra yadav
యోగేంద్ర యాదవ్​

By

Published : Jul 25, 2021, 2:26 PM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఆందోళన.. తప్పకుండా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు స్వరాజ్ ఇండియా వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్​. ప్రభుత్వం భేషజాలకు పోకుండా చట్టాలను వెనక్కు తీసుకోవాలన్నారు.

ఈటీవీ భారత్‌: రైతుల ఆందోళన మొదట్లో లక్షల మందితో జరిగినప్పుడే ఫలితం లేదు. ప్రస్తుతం వందల మందితోనే జరుగుతోంది కదా?

యోగేంద్ర యాదవ్‌: రైతుల ఆందోళన సంఖ్యాబలానికి సంబంధించింది కాదు. గతం కంటే ఇప్పుడే ఉద్ధృతంగా సాగుతోంది. ప్రతిరోజూ కొత్తగా 200 మంది కిసాన్‌ సంసద్‌ ప్రాంగణంలో కూర్చోవాలని మేమే నిర్ణయించాం. రైతుల ఆందోళనకు సంఘీభావం చెప్పేలా.. ప్రజలంతా సింఘు సరిహద్దు మీదుగానే దిల్లీలోకి వెళ్తున్నారు. ఉద్యమానికి విస్తృత మద్దతు ఉందనేందుకు ఇదే నిదర్శనం.

ప్రస్తుత ఆందోళన లక్ష్యాలేంటి?

ప్రధానంగా మూడు విషయాలను ప్రజలు, ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాం. మొదటిది.. ఇక్కడి రైతుల ఆందోళన, సమస్యలపై ఒక్క భారత్‌ పార్లమెంట్‌లో తప్ప ప్రపంచమంతా చట్టసభల్లో చర్చ జరిగింది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నా, రైతులే ముందుకు రావడం లేదన్న ప్రచారం చేస్తోంది. అయితే వాస్తవాలేంటో ప్రజలకు మేము చెబుతున్నాం. ఓటరు విప్‌ అంటే ఏమిటో మన నాయకులకు వివరిస్తున్నాం. ఎంపీలంతా తమ ఓటర్ల తరపున, వారి అభిప్రాయాన్నే పార్లమెంట్‌లో వినిపించాలని డిమాండ్‌ చేస్తున్నాం.

మన రైతుల ఆందోళనపై ఇతర దేశాల పార్లమెంట్‌లలో చర్చ జరిగిందని అంటున్నారు. ఇదంతా టూల్‌కిట్‌ కుట్రలో భాగమని ప్రభుత్వం అంటోంది?

దేశంలో నిజంగా బలమైన ప్రధాని, ప్రభుత్వం ఉంటే.. విదేశాల్లో కుట్రలు జరిగితే భయపడాల్సిన అవసరం ఏమిటి? ఒక్కసారిగా రాజద్రోహం కేసులెందుకు పెరుగుతున్నాయి. వీళ్లు ప్రజలకు సమాధానాలు చెప్పలేకే.. ఇలా ప్రభుత్వంపై కుట్రలంటూ వంకలు చెబుతున్నారు.

దేశంలోని రైతులంతా తమతోనే ఉన్నారని ప్రభుత్వం వాదిస్తోంది కదా...

హరియాణా, పంజాబ్, పశ్చిమ యూపీ, తూర్పు రాజస్థాన్‌లలో ఎంపీ, ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటో చూడండి. వారంతా రైతుల్ని ఒప్పించే స్థితిలో ఉంటే ఆయా ప్రాంతాల్లో ఎందుకు లక్షలాదిగా రైతులు ఆందోళనలు చేస్తున్నారో ఆలోచించండి. రైతుల ఉద్యమం వారం కూడా నడవదని మొదట్లో ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలే అన్నారు. కానీ 8 నెలలుగా సాగుతూనే ఉంది.

ఏడెనిమిది నెలలుగా ఆందోళన జరుగుతున్నా దీని ప్రభావం దేశవ్యాప్తంగా లేదెందుకు?

గత 200 ఏళ్లుగా చూస్తే.. ఏ రైతు ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా ఒకే తరహాలో లేదు. ప్రస్తుత ఆందోళన విషయానికొస్తే.. తొలుత పంజాబ్‌లోనే మొదలైంది. తర్వాత హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లకు విస్తరించింది. ఇటీవల మేము ఒక రోజు బంద్‌ పిలుపునిస్తే.. 18-20 రాష్ట్రాల్లో స్పందన వచ్చింది.

ఇప్పటికిప్పుడు పరిష్కారమేంటి?

రైతులు, రైతు సంఘాల అభిప్రాయం తీసుకోకుండా చేసిన చట్టాలివి. ప్రభుత్వం భేషజాలకు పోకుండా చట్టాలను వెనక్కు తీసుకోవాలి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు ఇప్పటికే విలువ కోల్పోయాయి. అవి డెత్‌ సర్టిఫికెట్‌ లాంటివి. వాటిపై ప్రభుత్వం సంతకం చేయడం లేదంతే.

ఇదీ చూడండి:'ఉద్యమం బలహీనపడలేదు- ఏకతాటిపైనే అన్నదాతలు'

ఇదీ చూడండి:'రైతులపైనా నిఘా- ఇది అనైతిక ప్రభుత్వం!'

ABOUT THE AUTHOR

...view details