ఆఖరి రౌండ్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన బంగాల్‌లోని నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై భాజపా నేత సువేందు అధికారి విజయం సాధించారు. ఆది నుంచి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు రోజు ఆ ఉత్కంఠ మరింత పెరిగింది. ప్రతి రౌండ్‌కు ఆధిక్యం మారుతూ వచ్చింది. ఓ దశలో 1200 ఓట్లతో మమత గెలిచారన్న వార్తలు వచ్చాయి. అనూహ్యంగా కాసేపటికే పరిస్థితి తారుమారైంది. సువేందు మమతపై 1,956 ఓట్ల తేడాతో గెలిచారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
బంగాల్‌లో మూడింట రెండొంతుల సీట్లతో తృణమూల్‌ను విజేతగా నిలిపిన మమత బెనర్జీ... తాను పోటీ చేసిన నందిగ్రామ్‌లో మాత్రం ఓటమి చవిచూశారు.
అన్నీ తెలిసినవాడై...
10ఏళ్ల పాటు మమతా బెనర్జీకి కుడిభుజంగా పని చేశారు సువేందు. నందిగ్రామ్ ఉద్యమంలో వారిది కీలక పాత్ర! కానీ పార్టీపై అసంతృప్తితో.. ఎన్నికలకు కొద్ది నెలల ముందు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి మమత-సువేందు పోరు ఆసక్తిగా మారింది.
సువేందు సొంత నియోజకవర్గం నందిగ్రామ్ నుంచే తానూ పోటీ చేస్తానని ప్రకటించి దేశాన్ని ఆశ్చర్యానికి గురుచేశారు మమత. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించుకున్నారు. వీరి మధ్య అనేకమార్లు మాటల తూటాలూ పేలాయి. గెలుపుపై ఇద్దరూ ధీమా వ్యక్తం చేశారు.
సువేందు విజయం...