ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో కలకలం రేపిన కారు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆ కారు కొంతకాలం క్రితం చోరీకి గురైందని అధికారులు తెలిపారు. ఆ కారు అసలు యజమాని హిరెన్ మన్సుఖ్.. వారం క్రితం దీనిపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గురువారం.. అంబానీ ఇంటికి దగ్గర్లో పార్కు చేసి ఉన్న కారు దృశ్యాలు చూసిన తర్వాత మన్సుఖ్.. పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చారని అధికారులు వెల్లడించారు.
కారు ఎలా పోయింది?
ఠాణె జిల్లాకు చెందిన మాన్సుఖ్.. ఫిబ్రవరి 17న ఓ వేడుకకు వెళ్తుండగా కారు చెడిపోవడం వల్ల ఐరోలీ ములుండ్ బ్రిడ్జ్ సమీపంలో పార్కు చేశారు. తర్వాత రోజు కారును తెచ్చుకోవడానికి వెళ్లగా.. అక్కడ లేదు. నాలుగు గంటలు పాటు వెతికిన తర్వాత కారు పోయినట్లు గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశానని మన్సుఖ్ తెలిపారు.