Suspicious Death Of Mla Daughter: ఉత్తర్‌ప్రదేశ్ భాజపా ఎమ్మెల్యే కూతురు పూనమ్ మౌర్య అనూహ్య రీతిలో మరణించారు. ఆహారం శ్వాసనాళంలో ఇరుక్కుపోవడం వల్లే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కూతురే పూనమ్ మౌర్య. భోపాల్‌లోని అయోధ్య నగర్లో పూనమ్ నివసిస్తున్నారు. 2017లో సంజయ్ మౌర్య అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో ఆమెకు వివాహం జరిగింది. గురువారం ఉదయం సంజయ్ నిద్రలేచేసరికి పూనమ్.. మంచంపై అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది. దీంతో అప్రమత్తమైన సంజయ్.. పూనమ్‌ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల హుటాహుటిన హమీడియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు వైద్యులు. కేసు తీవ్రత దృష్ట్యా శవపరీక్షను వీడియో తీశారు. ఈ పరీక్షలో ఆహారం గొంతులో ఇరుక్కుపోయి.. శ్వాస ఆడక పూనమ్ ప్రాణాలు కోల్పోయారని తేలింది.