Suspicious death Jr NTR fan: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మేడిశెట్టి శ్యామ్ సాయి మణికంఠ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 25న ఘటన జరిగినట్లు తెలుస్తుండగా.. ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో సాయి మణికంఠ మృతదేహం ఆలస్యంగా వెలుగుచూసింది. మణికంఠ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
శ్యామ్ సాయి మణికంఠ స్వగ్రామం కాట్రేనికోన మండలం కుప్పగుంట కాగా, కుటుంబం పదేళ్లుగా తిరుపతిలోనే ఉంటోంది. ఈ క్రమంలో మోడేకుర్రులోని తన పెద్దమ్మ ఇంటికొచ్చిన శ్యామ్ సాయి.. చేతి నరం కోసుకుని చీరతో ఉరేసుకున్నట్లుగాగుర్తించారు. సొంత కారణాలతో ఉరి వేసుకున్నట్లు గుర్తించామని చెప్పిన పోలీసులు.. మణికంఠ జేబులో బ్లేడు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని కొత్తపేట డీఎస్పీ రమణ వెల్లడించారు.
మేడిశెట్టి శ్యామ్ సాయి మణికంఠ సెల్ఫీ వీడియో శ్యామ్ మృతిపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన వెనుక కారణాలను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్యామ్ సాయి మణికంఠ మృతిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. శ్యామ్ అకాల మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన వెనక అనుమానాస్పద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని,సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలనిచంద్రబాబు డిమాండ్ చేశారు. మృతి వెనుక వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపించారు. వారి ప్రమేయంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరారు.
న్యాయం జరిగే వరకూ పోరాడుతాం : లోకేశ్... తూర్పుగోదావరి జిల్లా చింతలూరు యువకుని మృతిపై సమగ్ర విచారణకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం శ్యాం అనే యువకుడు అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. నిరుద్యోగ యువకుడు శ్యామ్ అనుమానాస్పద మృతి బాధాకరమని లోకేశ్ అన్నారు. శ్యాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానికులు ఆరోపిస్తున్నట్లు వైకాపా నేతల ప్రమేయం ఉన్నా ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్‌చేశారు. శ్యామ్‌కు న్యాయం జరిగే వరకు పోరాడుతామని లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు జరపాలని జూనియర్ ఎన్టీఆర్ సైతం నోటు విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.