అనుమానాలు ఎంత గట్టిగా ఉన్నప్పటికీ అవి సాక్ష్యాలు కాలేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆరోపణలకు రుజువులు ఉంటే తప్ప నిందితుల్ని శిక్షించలేమని తెలిపింది. ఒడిశాకు చెందిన హోంగార్డుకు ఇద్దరు వ్యక్తులు విషం తాగించి, కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేశారన్న ఆరోపణల్ని కొట్టిపారేసింది. ఈ విషయంలో ఒడిశా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది.
'అనుమానం సాక్ష్యం కాబోదు' - సుప్రీం కోర్టు తాజా తీర్పు
అనుమానాలు ఎంత బలంగా ఉన్నా.. నిందితులను శిక్షించాలంటే రుజువులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒడిశాకు చెందిన హోంగార్డు మృతి కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును సమర్థించింది.
బిజయ్ కుమార్ టుడు అనే హోంగార్డును బనబిహారి మహాపాత్ర, ఆయన కుమారుడు లుజు హత్య చేసినట్టు కేసు నమోదైంది. బినబిహారి ఉండే గదిలో బిజయ్ కుమార్ అచేతనంగా పడి ఉండటం వల్ల.. అతడే హత్య చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఇందుకు తగిన సాక్ష్యాలు సమర్పించనందున హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. దీనిపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా.. దానినే సమర్థించింది అత్యున్నత న్యాయస్థానం. మద్యం తాగి నిద్రపోయినప్పుడు అనుకోకుండా విద్యుత్తు తీగను తాకి మరణించి ఉండవచ్చని కోర్టు అభిప్రాయపడింది.
ఇదీ చదవండి:'రైతుల మేలు కోసమే సాగు చట్టాలు'