Suspension of MPs in Parliament Reaction :పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ భగ్గుమంది. ప్రజాస్వామ్యాన్నే సస్పెండ్ చేశారని మండిపడింది. నియంతృత్వానికి ఇది పరాకాష్ఠ అని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య నిబంధనలన్నింటినీ ఈ నిరంకుశ ప్రభుత్వం చెత్తకుప్పలో పడేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. పార్లమెంట్ పట్ల మోదీ సర్కారుకు జవాబుదారీతనం లేదని అన్నారు. విపక్షాలు లేకుండా కీలక బిల్లులను ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు.
"తొలుత పార్లమెంట్‌పై చొరబాటుదారులు దాడి చేశారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌తో పాటు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోంది. ప్రజాస్వామ్య నిబంధనలన్నీ నియంతృత్వ మోదీ ప్రభుత్వం చెత్తకుప్పలో పడేసింది. విపక్షాలు లేని పార్లమెంట్లో మోదీ ప్రభుత్వం కావాల్సిన చట్టాలను అసమ్మతి లేకుండా, ఎలాంటి చర్చ చేపట్టకుండా ఆమోదించుకోవచ్చు. ప్రధానమంత్రి ఓ వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తారు. హోంమంత్రి టీవీ ఛానళ్లతో మాట్లాడతారు. కానీ భారత ప్రజలకు ప్రతిబింబంగా నిలిచే పార్లమెంట్ పట్ల వారికి కనీస జవాబుదారీతనం లేదు."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
ప్రభుత్వ నియంతృత్వం పరాకాష్ఠకు చేరుకుందని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ధ్వజమెత్తారు. సభా నిర్వహణలో విపక్షాలను కలుపుకొని వెళ్లడం చాలా ముఖ్యమని అన్నారు. అందరినీ సస్పెండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానాషాహీ(నియంతృత్వం)కి మరో పేరు మోదీషాహీ అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్. తాజాగా ప్రజాస్వామ్యాన్నే సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఎంపీలను సస్పెండ్ చేయడం విపక్షాలను అణచివేసి ప్రజల ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కే ప్రక్రియ అని కాంగ్రెస్ లోక్‌సభ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగొయి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత దిగజారిందని అన్నారు. బీజేపీ ఎంపీతో ఈ సమస్య మొదలైందని, ఆయనపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
'సభనే రద్దు చేయండి'
ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు అపహాస్యం చేస్తోందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. సభనే పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సభను నడిపించే నైతిక హక్కు అధికార పక్షానికి లేదని అన్నారు. అందరినీ సస్పెండ్ చేస్తే ప్రజల పక్షాన మాట్లాడేవారు ఎవరుంటారని ప్రశ్నించారు. కీలక బిల్లులను సైతం మోదీ ప్రభుత్వం ఆమోదించుకుంటోందని, ఇప్పటికిప్పుడు న్యాయ చట్టాలపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమేముందని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వీటిపై సమీక్ష చేసుకోవచ్చని గుర్తు చేశారు.
ఈ అంశంపై మంగళవారం జరిగే ఇండియా కూటమి సమావేశంలో చర్చిస్తామని టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ తెలిపారు. ఈ ఘటన తర్వాత కూటమి పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తాయని అన్నారు.