Suspended MPs Protest At Parliament :141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. 'సేవ్ డెమోక్రసీ' అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ నిరసనలో పాల్గొన్నారు.
"పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కొద్దిరోజులుగా మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్య చరిత్రలో ప్రపంచంలోని ఏ దేశంలోనూ 150 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరగలేదు. పార్లమెంట్ భద్రత ఉల్లంఘనపై హోం మంత్రి వివరణ ఇవ్వాలని విపక్షాలు కోరినా ఆయన పార్లమెంట్‌కు రాలేదు. బయట ప్రకటనలు చేస్తున్నారు కానీ పార్లమెంట్‌కు రావడం లేదు. అందులో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాన్ని బాధ్యతాయుతంగా పనిచేయనివ్వడంలో ప్రభుత్వానికి ఆసక్తి లేదు"
--శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ
40మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేసిన పరిస్థితుల్లో దీర్ఘ దృష్టితో ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెడుతోందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు. వారికి సభలో మెజారిటీ ఉందన్న చిదంబరం, కానీ కనీసం మా (ప్రతిపక్షాలు) ఆలోచనలైనా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు.
మాకు ఆ ఉద్దేశం లేదు : మమతా బెనర్జీ
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అనుకరిస్తూ తృణమూల్ నేత కల్యాణ్ బెనర్జీ చేసిన మిమిక్రీపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం స్పందించారు. ధన్‌ఖడ్‌ను అగౌరవపరిచేలా చేయడం తమ పార్టీ ఎంపీ ఉద్దేశం కాదన్నారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న కేంద్ర నిధుల విషయమై మమతా బెనర్జీ ప్రధాని మోదీని కలిశారు.
'ప్రభుత్వం అహంకారం గురించి చెప్పటానికి పదాలు లేవు'
ఎంపీల సస్పెన్షన్ విషయమై ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఎదురుదాడి పెంచారు. చట్టబద్ధమైన డిమాండ్ చేసినందుకు కేంద్రప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న సోనియా, గతంలో ఎప్పుడూ కూడా ఇంతమంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయలేదన్నారు. అది కూడా సహేతుకమైన, చట్టబద్ధమైన డిమాండ్ చేసిన ప్రతిపక్ష ఎంపీలపై ఇలా వేటు వేయలేదని సోనియా పేర్కొన్నారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన చేయాలని మాత్రమే ఎంపీలు అడిగినట్లు చెప్పారు. అయితే ఎంపీల అభ్యర్థనపై ప్రభుత్వం వ్యవహరించిన అహంకారాన్ని చెప్పటానికి పదాలు లేవని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంటులో జరిగిన అలజడి ఘటన క్షమించరానిదన్న సోనియా గాంధీ దాన్ని ఎవరూ సమర్థించలేరని తెలిపారు. దీనిపై స్పందించడానికి ప్రధాని మోదీకి నాలుగు రోజుల సమయం పట్టిందని విమర్శించారు. అది కూడా ఆయన తన అభిప్రాయాలను పార్లమెంటు వెలుపల వ్యక్తం చేశారన్నారు. ఇది సభను అపహాస్యం చేయడమేనని తీవ్రస్థాయిలో మడి పడ్డారు. దేశ ప్రజల పట్ల ఆయన నిర్లక్ష్యపూరిత వైఖరికి ఇది నిదర్శమని విమర్శించారు.
'దేశంలో 'ఏకపార్టీ పాలన'- మోదీ మనసులో ఉందదే!'
దేశంలో 'ఏకపార్టీ పాలన' నెలకొల్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ భావిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అందుకే పార్లమెంటు నుంచి ఎంపీలను సస్పెండ్ చేశారని విమర్శించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై హోం మంత్రి అమిత్ షా నుంచి ప్రకటన కోరినందుకు 141 మంది సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. అంతేకాకుండా నిందితులు సభలోకి చొరబడడానికి కారణమైన బీజేపీ పార్లమెంట్ సభ్యుడిని ఇప్పటి వరకు ప్రశ్నించలేదని చెప్పారు. పార్లమెంట్‌కు పటిష్ఠ భద్రత ఉన్నా దుండగులు లోపలికి ఎలా ప్రవేశించగలిగారని ప్రశ్నించారు.
పార్లమెంట్లో ఆగని నిరసనలు- మరో 49మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
'ఇలాంటి ప్రవర్తనతో 2024 ఎన్నికల్లో మరిన్ని సీట్లు కోల్పోతారు'- ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ ఫైర్