India First Monkeypox Death: కేరళలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో ప్రాణాలు కోల్పోయిన యువకుడికి మంకీపాక్స్ నిర్ధరణ అయ్యింది. సదరు యువకుడు.. జులై 21న యూఏఈ నుంచి కేరళకు వచ్చాడు. స్వదేశానికి వచ్చేముందే జులై 19న యూఏఈలో అతడి నుంచి నమూనాలు సేకరించారు. కేరళకు వచ్చిన తర్వాత మంకీపాక్స్ తరహా లక్షణాలతో యువకుడు త్రిస్సూరులోని ఓ ఆస్పత్రిలో జులై27న చేరాడు. జులై 30న చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
అతడికి మంకీపాక్స్ సోకిందనే అనుమానంతో నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ నుంచి వివరాలు రాగా.. యువకుడికి మంకీపాక్స్ సోకినట్లు నివేదికల్లో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. యూఏఈలో జరిపిన పరీక్షల్లోనూ మంకీపాక్స్ నిర్ధరణ అయినట్లు జులై 30న అతడి కుటుంబసభ్యులకు సమాచారం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
స్వగ్రామంలో భయాందోళనలు..
మంకీపాక్స్‌తో చనిపోయిన యువకుడి స్వగ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. యువకుడు మృతిచెందటం వల్ల త్రిస్సూర్ జిల్లాలో పున్నయార్ గ్రామవాసులు అందరూ సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే గ్రామ ప్రజల్లో ఎలాంటి ఆందోళన లేదని పేర్కొన్నారు. యూఏఈ నుంచి వచ్చిన తర్వాత.. బాధితుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాత్రమే సన్నిహితంగా మెలిగినట్లు.. వివరిస్తున్నారు. బాధితుడితో పది మంది సన్నిహితంగా మెలిగినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 20 మందిని క్వారంటైన్ చేసినట్లు వివరించారు.