బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌లో అనుమానాస్పద మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బెతియా పట్టణంలోని లౌరియా గ్రామంలో 15 రోజుల వ్యవధిలో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. కల్తీ మద్యం వల్లే వీరంతా చనిపోయారని అధికారులు భావిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది మూడ్రోజుల క్రితమే మరణించారు.
కల్తీ మద్యమే దీనికి కారణమని మృతిచెందిన నలుగురి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఇద్దరు మాత్రం దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు తెలుస్తోంది. మిగిలిన పది మంది మరణానికి కల్తీ మద్యమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు, కల్తీ మద్యం వల్ల అస్వస్థతకు గురై ముంతాజ్ మియాన్(36) అనే వ్యక్తి ఆస్పత్రిపాలయ్యాడు. అతని సోదరుడి ఫిర్యాదు మేరకు గ్రామంలోని థగ్ షా అనే మద్యం వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశామని, మరో నలుగురిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.