PM Modi Kashmir Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన వేళ.. జమ్మూ బిశ్నా ప్రాంతంలోని లలియాన్ గ్రామంలో ఆదివారం పేలుడు సంభవించింది. ప్రధాని ప్రసంగించనున్న పల్లీ గ్రామానికి ఇది కేవలం 7 కిలోమీటర్ల దూరంలో జరిగింది. వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ పేలుడు గురించి గ్రామస్థులు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. దీనిని పిడుగుపాటు లేదా ఉల్కగా అనుమానిస్తున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా దేశంలోని గ్రామ పంచాయతీలను ఉద్దేశించి సాంబాలోని పల్లీ గ్రామంలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ వేదిక వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఈ పర్యటనలో బనిహాల్-కాజీగుండ్ సొరంగ మార్గంతో పాటు, రూ.20 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మోదీ.
ఉగ్రవాది అరెస్టు: జైషే మహ్మద్‌కు చెందిన షఫీక్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాదిని శనివారం అరెస్టు చేశారు కశ్మీర్ పోలీసులు. అతడు త్రాల్ ప్రాంతానికి చెందినవాడని, భద్రతా దళాలను మట్టుబెట్టే కుట్రలో అతడు కూడా భాగమని పోలీసులు తెలిపారు. "జమ్మూకు వచ్చి భద్రతా దళాల క్యాంపునకు దగ్గర్లోని తన ఇంట్లో ఇద్దరు ముష్కరులను ఉంచాలని షఫీక్‌కు ఉగ్రసంస్థ నుంచి ఆదేశాలు వచ్చాయి. వారిద్దరినీ సాంబా నుంచి అతడి వద్దకు తీసుకురావాల్సిన వ్యక్తిని బిలాల్ అహ్మద్‌గా గుర్తించాం. అయితే భద్రతా దళాలపై దాడికి ముందే వారు ఎన్కౌంటర్లో హతమయ్యారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది" అని అధికారులు వెల్లడించారు.