Surya Namaskar World Record 2023 : సూర్య నమస్కారాల్లో గుజరాత్ సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించింది. మోఢేరాలోని సూర్య దేవాలయం సహా 108 ప్రదేశాల్లో వేలాది మంది సూర్య నమస్కారాలు చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. కొత్త సంవత్సరం తొలిరోజునే ఈ ఘనత సాధించారు. సూర్య నమస్కార కార్యక్రమాన్ని గుజరాత్‌లోని 108 ప్రదేశాల్లో గుజరాత్ రాష్ట్ర యోగా బోర్డు నిర్వహించింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష్ సంఘ్వీ ఈ సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్య నమస్కార పోటీల్లో రాష్ట్ర స్థాయి విజేతలకు బహుమతులు అందజేశారు.
సూర్య నమస్కారాల కార్యక్రమం ద్వారా విశేషమైన ఘనతను సొంతం చేసుకుని గుజరాత్ 2024 ఏడాదికి ఘనంగా స్వాగతం పలికిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 108 అనే సంఖ్యకు భారత సంస్కృతిలో విశేషమైన ప్రాధాన్యం ఉందన్నారు. యోగా సహా మన సాంస్కృతిక వారసత్వం పట్ల మనకున్న నిబద్ధతకు ఇది నిదర్శమని అభిప్రాయపడ్డారు. సూర్య నమస్కారాల వల్ల ఎంతో ప్రయోజనం ఉందని, రోజువారీ కార్యకలాపాల్లో వీటిని భాగంగా చేసుకోవాలని ప్రజలను ప్రధాని మోదీ కోరారు. మరోవైపు, ఒకే సమయంలో ఎక్కువ మంది యోగా చేసిన రికార్డు కూడా గుజరాత్ పేరిటే ఉంది.
Karnataka Mass Surya Namaskar: కొన్నాళ్ల క్రితం కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఒకేసారి 3,200 మంది విద్యార్థులు సూర్యుడి ఆకారంలో నిలబడి.. ఆసనాలు వేశారు. బంట్వాల్ మండలం కల్లడ్కలోని శ్రీరామ విద్యాకేంద్రం ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.