Maharashtra Bus Accident : మహారాష్ట్రలో 26 మందిని బలిగొన్న బస్సు ప్రమాదంలో అతికొద్ది మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకోగలిగారు. అతికష్టం మీద బస్సు వెనుక అద్దం పగలగొట్టి, బయటపడినట్లు ఓ ప్రయాణికుడు చెప్పాడు. తనతోపాటు మరికొందరు మాత్రమే అలా చేయగలిగినట్లు వెల్లడించాడు.
"బస్సు టైరు పేలింది. వెంటనే వాహనానికి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే అగ్నికీలలు బస్సు మొత్తం వ్యాపించాయి. నేను, నా పక్క సీట్ల కూర్చున్న ప్రయాణికుడు మాత్రమే బస్సు వెనుక అద్దం పగలగొట్టి బయటకు వచ్చాం. ప్రమాదం జరిగిన కాసేపటికే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు" అని పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ఆ ప్రయాణికుడు చెప్పాడు.
మహారాష్ట్ర బుల్డానా జిల్లా సిండ్ఖేడ్రాజా ప్రాంతంలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం 1.30గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవదహనమయ్యారు. 8 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దగ్గర్లోని పింపల్ఖుటా గ్రామ ప్రజలు కూడా వీరికి సహాయక చర్యల్లో తమ వంతు సాయం అందించారు. హైవేపై వెళ్తున్న వాహనాల్లోని వారు ఆగి, సాయం చేసి ఉంటే.. మరింత మందిని కాపాడగలిగేవారమని పింపల్ఖుటా గ్రామస్థులు వాపోయారు.