అమెరికా సహా నాటో దళాల ఉపసంహరణతో అఫ్గానిస్థాన్‌పై తాలిబన్లు తెగబడుతున్నారు. విధ్వంసం సృష్టిస్తూ దేశాన్ని క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కీలకమైన భూభాగాలన్నీ తాలిబన్ల వశమైపోతున్నాయి.
లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ తీవ్రవాదులు తాలిబన్లతో కలిసి పనిచేస్తుండటం ఇప్పుడు భారత్‌కు ఆందోళనకరంగా మారింది.
"కొద్దిరోజుల నుంచి ఈ పోకడలను గమనిస్తున్నాం. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. భారత్‌పై వీటి ప్రభావాన్నీ అంచనా వేస్తున్నాం. కచ్చితంగా ఇది ఆందోళకరమైన విషయం."
-భారత భద్రతా వ్యవహారాల వర్గాలు
ఈ రెండు ఉగ్రసంస్థలు తాలిబన్లకు మానవ వనరులను అందిస్తున్నాయి. పంజాబ్ ప్రావిన్స్ నుంచి 'పోరాట యోధుల'ను అఫ్గాన్‌కు పంపుతున్నాయి. ఇటీవల తాలిబన్లు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో జైషే, లష్కరే భాగమయ్యారని వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముష్కరులు కనిపించినట్లు పలు కథనాలు వెలువడుతున్నాయి. ఐరాస భద్రతా మండలి నివేదిక సైతం ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఈ రెండు సంస్థలు పాకిస్థాన్ నుంచే పనిచేయడం, భారత్‌ను లక్ష్యంగా చేసుకొనే కార్యకలాపాలు సాగించడం గమనార్హం.
"లష్కరే, జైషే సంస్థలు పోరాట ఉగ్రవాదులను అఫ్గానిస్థాన్‌కు పంపిస్తోంది. సలహాదారులు, శిక్షకులు, పేలుడు పదార్థాల తయారీలో నిపుణులు ఇందులో ఉంటున్నారు. ప్రభుత్వ అధికారులు, ఇతరులను లక్ష్యంగా చేసుకొని హతమార్చడం వెనక ఈ రెండు ఉగ్రసంస్థలదే హస్తం."
-ఐరాస భద్రతా మండలి
ఐరాస పత్రాల ప్రకారం.. నంగర్హార్ ప్రావిన్సులోనే 800 మంది లష్కరే తొయిబా, 200 మంది జైషే ముష్కరులు ఉన్నారు. మహమంద్ దరా, దుర్ బాబా, షెర్జాద్ జిల్లాల్లో వీరంతా మోహరించారు. కునార్ అనే మరో రాష్ట్రంలోనూ ఈ రెండు ముష్కర ముఠాలకు చెందిన ఉగ్రవాదులు భారీగా పోగయ్యారు. దీన్ని బట్టి నిధులు, ఆయుధాలు, రిక్రూట్మెంట్ విషయంలో తాలిబన్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని అర్థమవుతోందని ఐరాస భద్రతా మండలి పత్రాలు పేర్కొంటున్నాయి.