Surat girl face off with thieves: అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దోపిడీ దొంగలను సివంగిలా ఎదిరించింది గుజరాత్ సూరత్‌కు చెందిన 20 ఏళ్ల యువతి. ముగ్గురు దుండగులను ఒంటి చేత్తో నిలువరించింది. తనతో పాటు చెల్లి, అమ్మకు దొంగల నుంచి ఎలాంటి హాని లేకుండా కాపాడుకుంది. ఈ యువతి ధైర్యాన్ని చూసి బెంబేలెత్తిన ఆగంతుకులు పారిపోయారు. అయితే వారిని ఎదిరించే క్రమంలో యువతి చేతికి పెద్ద గాయమైంది. మొత్తం 24 కుట్లు పడ్డాయి.
Girl Fighting Thieves: మహారాష్ట్రకు చెందిన బాబూరాం కాశీనాథ్ కుటుంబం సూరత్‌లోని పల్సానా తాలుగా ఛల్తానా గ్రామంలో రైల్వే గేట్ సమీపంలో నివాసముంటోంది. మిల్లులో పనిచేస్తున్న అతనికి మంగళవారం నైట్ డ్యూటీ పడింది. దీంతో భార్య భారతీబెన్, కూతుళ్లు రియా, రిచా ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అతడు మిల్లుకు వెళ్లాడు. అయితే ఇదే అదునుగా భావించిన దొంగలు దోపిడీకి ప్రయత్నించారు. రాత్రి 1:30 గంటలకు కరెంట్ పోగానే తలుపు గడియ పగలగొట్టి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే వార్షిక పరీక్షల కోసం సన్నద్ధవుతున్న రియా ఆ సమయంలో చదువుకుంటోంది. కరెంటు పోయినా మెలకువతోనే ఉండటం వల్ల దొంగలు ఇంట్లోకి వస్తున్నారని గమనించింది. వారి వద్ద ఆయుధాలు ఉన్నా ధైర్యంగా పోరాడింది. మొదట ఓ దొంగను నిలువరించగా.. ఆ తర్వాత మరో ఇద్దరు దొంగలు ఇంట్లోకి వచ్చారు. అందులో ఒకరు తన చెల్లి వైపు వెళ్తుండగా.. రియా బిగ్గరగా అరిచింది. దీంతో రిచాతో పాటు తల్లి భారతీబెన్ కూడా లేచింది. ఇంతలోనే కరెంటు వచ్చింది. దీంతో దొంగలు ఇంటి నుంచి పరారయ్యారు. అయితే దొంగతో పోరాడే క్రమంలో అతని వద్ద ఉన్న ఆయుధం వల్ల రియా చేతికి పెద్ద గాయమైంది. ఆస్పత్రికి వెళ్లగా 24 కుట్లు పడ్డాయి.