తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో భాజపా 'సురక్ష' నినాదం గెలిపిస్తుందా? - undefined

ఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన పలు ఘటనలను ఎన్నికల ప్రచారంలో భాజపా పదేపదే గుర్తు చేస్తోంది. సురక్ష నినాదాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. దీనిని భాజపా ప్రధానాశ్రంగా చేసుకుని యూపీ ఎన్నికల్లో ముందుకు వెళ్తోంది.

suraksha campaign running by bjp in up elections
సురక్ష నినాదం గెలిపిస్తుందా?

By

Published : Feb 18, 2022, 7:39 AM IST

హోరాహోరీ పోరును తలపిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ భాజపా.. శాంతి భద్రతల పరిరక్షణను తమ ప్రభుత్వ ప్రధాన విజయంగా చెబుతోంది. అయిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా కొన్ని ప్రతికూలతలనూ అది ఎదుర్కొంటోంది. నిరుద్యోగం, అధిక ధరలు వంటి అంశాలను విపక్ష సమాజ్‌వాదీ పార్టీ ప్రచార అస్త్రంగా మలచుకొన్న పరిస్థితుల్లో తన ఆయుధాలకు కమలదళం పదనుపెట్టింది. శాంతి భద్రతలను కాపాడటం కోసం ఆదిత్యనాథ్‌ సర్కారు చేపట్టిన కఠిన చర్యలపై రాష్ట్రంలోని కొన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావాన్ని ఈ అంశం ఎంత మేరకు తగ్గిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

గూండాలకు ఆశ్రయమిచ్చేదిగా ఎస్పీపై ముద్ర

సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఘటన ఇది. యూపీ పోలీసుల చరిత్రలోనే అత్యంత అవమానకరమైనది. 2016 మార్చి 12న డాలీబాగ్‌లో పోలీస్‌ ఔట్‌పోస్టుకు సమీపంలో ఎస్పీ నాయకుడు వాహనాన్ని నిలపగా కానిస్టేబుల్‌ అభ్యంతరం తెలిపారు. దీంతో ఆ నాయకుడు ఆగ్రహంతో కానిస్టేబుల్‌ను దూషిస్తూ..అతనిని వాహనం బానెట్‌పైకి విసరి డాలీబాగ్‌ అంతటా తిప్పాడు. సమాజ్‌వాదీ నాయకుడికి ఎదురు చెబితే ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు. పత్రికల్లో పతాక శీర్షికల్లోకి ఎక్కిన ఈ ఘటనపై అప్పటి అఖిలేశ్‌ యాదవ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్య మరింత విస్మయం కలిగించింది. దురుసుగా ప్రవర్తించిన నాయకుడిపై ఎలాంటి చర్య తీసుకోకపోగా కానిస్టేబుల్‌ను మరో ప్రాంతానికి బదిలీ చేసింది. సమాజ్‌వాదీ సర్కారుపై వెల్లువెత్తిన ప్రజాగ్రహమే 2017లో భాజపాను భారీ ఆధిక్యంతో గెలిపించింది. ఆ ఎన్నికల్లో కమలనాథుల విమర్శ ఏమిటంటే...'ఎస్పీ జెండాతో తిరిగే ప్రతి వాహనంలో గూండాలు తప్పనిసరిగా ఉంటారు' అని. ఆ నినాదం ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది.

2007లో బీఎస్పీ నినాదం కూడా అదే..

యూపీలో 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని ఓడించి బీఎస్పీ అధికారంలోకి వచ్చింది. 'గూండాలను అణచివేయాలంటే ఏనుగు గుర్తుకు ఓటెయ్యండి' అని బహుజన సమాజ్‌ పార్టీ ఆ ఎన్నికల్లో ప్రజలకు పిలుపునిచ్చింది. అధికారంలో ఉన్నా, లేకున్నా నేరగాళ్లతో సమాజ్‌వాదీలకు బలమైన సంబంధాలు ఉంటాయన్నది ప్రధాన ఆరోపణ.

సురక్ష.. సురక్ష..

ఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన పలు ఘటనలను ఎన్నికల ప్రచారంలో భాజపా పదేపదే గుర్తు చేస్తోంది. సురక్ష నినాదాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. రాష్ట్ర ప్రజల్లో ఒక్కో వర్గం వారికి ఈ నినాదం ఒక్కో విధంగా వర్తిస్తోంది. గ్రామాల్లోని వారు తమ పశువులు, వస్తువులు చోరీ కాకుండా రక్షణ కావాలని కోరుకుంటున్నారు. పట్టణాల్లోని ఉన్నత కులాల వారికి తమ మహిళల భద్రత ప్రధాన అంశం. వీధివ్యాపారులు, ఆటోరిక్షా డ్రైవర్లు తదితరులకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ఆవరణలో బలవంతపు వసూళ్ల నుంచి రక్షణ కావాలంటున్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో 55శాతం మంది అభ్యర్థులపై నేరారోపణలు ఉన్నాయని భాజపా నేతలు ఎత్తి చూపుతున్నారు.

నేరగాళ్లపై యోగి ఉక్కు పాదం

  • 2017 మార్చిలో యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే..బుల్లెట్‌కు బుల్లెట్‌తో సమాధానం చెప్పాలని, పోలీసులకు పూర్తి అధికారం ఇస్తున్నానని ఆదిత్యనాథ్‌ ప్రకటించారు.
  • గత అయిదేళ్లలో పోలీసులు 182 మంది క్రిమినల్స్‌ను హతమార్చారు. చాలా వరకు ఎదురుకాల్పులు బూటకమైనవేనని మానవహక్కుల సంఘాలు ఆరోపించాయి. పోలీసులు వాటిని ఖండించారు.
  • నేరగాళ్లను గాయపరిచే ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా 4206 మంది కాళ్లలోకి పోలీసులు కాల్పులు జరిపారు.

2021 డిసెంబరు వరకు నేరారోపణలున్న 21,625 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి ఎలాంటి గాయాలు కాలేదు.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆదిత్యనాథ్‌ పాలనలో బందిపోటు ఘటనలు 72శాతం, దోపిడీలు 62శాతం, హత్యలు 31శాతం, అత్యాచారాలు 50శాతం తగ్గిపోయాయి.

వివక్ష చూపారంటూ ఆరోపణలు

కరడుగట్టిన నేరగాళ్ల ఏరివేతలో భాజపా ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. యూపీ నేరగాళ్లలో అత్యధికులు ఠాకుర్‌, ముస్లిం, యాదవ్‌, బ్రాహ్మణ వర్గాలకు చెందినవారు. అయితే, పోలీసులు యాదవ్‌, ముస్లిం వర్గాలను లక్ష్యంగా ఎంచుకొని, ఠాకుర్లను వదిలేశారని ఎస్పీ ఆరోపించింది. బ్రాహ్మణులపైనే ఎక్కువగా గురిపెట్టారని విమర్శించిన బీఎస్పీ వికాస్‌ దుబే ఘటనను అందుకు నిదర్శనంగా చూపుతోంది.

ఇదీ చూడండి:punjab assembly election: అంతర్గత కలహాలే.. అసలు సవాల్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details