ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడో వివాహితుడు. అనంతరం ఆమె మృతదేహాన్ని తన స్నేహితుల సహాయంతో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకోడానికి, కేసును తప్పుదోవ పట్టించడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. అందులో భాగంగా బాధితురాలు తప్పిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కొద్ది రోజులు వీరి ప్లాన్ వర్కవుట్ అయినా.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ హత్య కేసులో ఓ మహిళ సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన గుజరాత్లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..
ధారా కడివార్ అనే యువతి జునాగఢ్‌లో నివసిస్తోంది. ఈమెకు ఇదే ప్రాంతానికి చెందిన సూరజ్ భువాజీ అనే వివాహితుడితో 2021లో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్ది రోజులు గడిచాక వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భార్యాపిల్లలు ఉన్న సూరజ్.. ఎలాగైనా తన ప్రియురాలిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అనకున్నదే తడవుగా.. అహ్మదాబాద్‌లో ఓ ఫుడ్‌స్టాల్ నడుపుతున్న తన స్నేహితుడు మిట్ షా సహాయం కోరాడు. ప్లాన్‌లో భాగంగా.. లాయర్ ఫీజు కట్టడానికి అహ్మదాబాద్ వెళ్లాలని ధారాను నమ్మించాడు సూరజ్. అనంతరం ధారా, సూరజ్, మిట్ షా కలిసి 19 జూన్ 2022న జునాగఢ్ నుంచి అహ్మదాబాద్‌కు బయలు దేరారు. వటవాచ్ అనే ప్రాంతంలో కారు ఆపారు. డ్రైవర్ సీటులో కూర్చున్న సూరజ్ ఫీజు చెల్లించడానికి అని కిందకు దిగుతుండగా.. అప్పుడే అక్కడికి వచ్చిన సూరజ్ సోదరుడు యువరాజ్, అతడి స్నేహితుడు గుంజన్ జోషి, అతడి అంకుల్ ముఖేశ్ ధారతో గొడవకు దిగారు. సూరజ్‌ను విడిచిపెట్టాలని బెదిరించారు.
ఆ సమయంలో కారు వెనక సీటులో కూర్చున్న మిట్ షా.. ధారా చున్నీతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు నిందితులు. సూరజ్, మీట్, గుంజన్, యువరాజ్, ముఖేశ్ కలిసి అక్కడ ఉన్న ఎండు గడ్డిని సేకరించి.. మృతదేహంపై పెట్రోలుతో పాటు ఆ గడ్డి వేసి కాల్చేశారు. ఆ తర్వాత సూరజ్, మీట్ కారులో అహ్మదాబాద్ వచ్చారు. ధారా శరీరం పూర్తిగా కాలిపోయే వరకు మిగతా నిందితులు ఘటన స్థలంలోనే ఉన్నారు. ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ చేరుకున్న సూరజ్, మీట్.. వారి మరో స్నేహితుడు సంజయ్ సోహేలియాకు.. ధారా దుస్తులు వేసి కారులో కూర్చోబెట్టారు. దీంతో సీసీటీవీలో రికార్డైన దృశ్యాల్లో.. కారులో మహిళ ఉన్నట్లు పోలీసులను తప్పుదారి పట్టించారు.