తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ఉచితాలపై ఏకాభిప్రాయం కావాలన్న సుప్రీంకోర్టు - supreme court on freebies

Freebies in India రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు తీవ్రమైన అంశమని దీనిపై చర్చ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని సీజేఐ జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రశ్నించింది. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయబోతున్నాయని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చేంత వరకు ఉచిత వాగ్దానాలు ఆగబోవని స్పష్టం చేసింది.

sc
సుప్రీంకోర్టు

By

Published : Aug 24, 2022, 9:37 PM IST

freebies in India: రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు తీవ్రమైన అంశమని గుర్తించింది. దీనిపై చర్చ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని సీజేఐ జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రశ్నించింది. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయబోతున్నాయని తెలిపింది. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చేంత వరకు ఉచిత వాగ్దానాలు ఆగబోవని స్పష్టం చేసింది.

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచితాలను వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాలు తీవ్రమైన అంశమని..అందులో ఎలాంటి సందేహం లేదన్న ధర్మాసనం తెలిపింది. కేంద్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించింది. పిటిషనర్‌ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది వికాస్‌సింగ్‌.. ఉచితాలపై ఏర్పాటు చేసే కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా.. ఉండాలని కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ.. పదవీ విరమణ చేసిన వ్యక్తికి.. పదవీ విరమణ చేయబోయే వ్యక్తికి ఈ దేశంలో విలువ ఉండదని అదే సమస్యని వ్యాఖ్యానించారు.

సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ స్వచ్ఛంద సంస్థ తరపున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ 3రకాల ఉచితాలను నిషేధించాలని కోరారు. వివక్ష చూపేవి, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవి, ప్రజావిధానానికి విరుద్ధమైన ఉచితాలను నిషేధించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో లేదా కేంద్రంలో.. అధికారంలో లేని రాజకీయపార్టీలు ఉచిత వాగ్దానాలను ఇస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించింది. రాజకీయ పార్టీలు ఉచితాలు తమ హక్కు అని పేర్కొంటూ.. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఉచితాలను అందించడం తమ ప్రాథమిక హక్కుగా భావించే కొన్ని రాజకీయ పార్టీలు.. అలాంటి ఉచితాలు మాత్రమే అందించి అధికారంలోకి కూడా వచ్చాయని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ఉచితాలపై ఏర్పాటు చేసే కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారనేదే అతిపెద్ద సమస్యగా మారిందని సీజేఐ జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. అంతిమంగా రాజకీయ పార్టీలు మాత్రమే ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తాయని.. వ్యక్తులు కాదన్న సీజేఐ తెలిపారు. తాను పోటీచేస్తే పది ఓట్లు కూడా రాకపోవచ్చన్నారు. ప్రస్తుత వ్యవస్థలో వ్యక్తులకు పెద్దగా ప్రాధాన్యం లేదన్న సీజేఐ జస్టిస్‌ రమణ.. ఎన్నికల మేనిఫెస్టో అంశాలపై ఈసీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2013లో ఇచ్చిన తీర్పుపై.. పునః పరిశీలిన అవసరమన్నారు. ఈ తీర్పును పరిశీలించడానికి ముగ్గురు జడ్జీల బెంచ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఉచితాలపై భాజపాసహా అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు ఉన్నాయని.. ప్రతి ఒక్కరూ ఉచితాలు కోరుకుంటారని, అందుకే తామే ఉచితాలపై జోక్యం చేసుకున్నామని ధర్మాసనం వెల్లడించింది. ఉచితాలపై ఆర్థికసంఘం ఏర్పాటు చేయాలని ధర్మాసనం సహాయకుడు.. సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సూచించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details