"మాకు తెలిసినంతవరకూ.. ఆర్థిక కుంభకోణాల్లో కేసుల విచారణలు సీబీఐ, ఈడీల చేతికి వచ్చినపుడల్లా ఆలస్యమే. ఏళ్లతరబడి సాగదీస్తారు. ఇప్పటిదాకా ఎన్ని ఆర్థిక కుంభకోణాల కేసులను సరిగ్గా తేల్చారో మాకు చెప్పండి? మీకు కేసుల భారం ఎక్కువగా ఉండవచ్చు. సిబ్బంది సరిపడా లేకపోవచ్చు. మీకు సరైన వ్యవస్థ లేకపోవచ్చు. సీబీఐ అధికారులంతా ఎక్సైజ్, కస్టమ్స్ శాఖల నుంచి డిప్యుటేషన్లపై వచ్చినవారే. వారికి విచారణల గురించి తెలియదు. దీనిపై మళ్లీ వాయిదాలు ఉండవు. సోమవారం విచారిస్తాం. తీవ్రంగా పరిగణించండి. మరింత అప్రమత్తంగా ఉండాలని మీ అధికారులకు చెప్పండి. శనివారం నాటికల్లా సమాధానం ఏమిటో తెలియజేయండి" అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉద్దేశించి అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'ఎన్ని కుంభకోణాల కేసులు సరిగ్గా తేల్చారు?'.. సీబీఐ, ఈడీలకు సుప్రీం ప్రశ్నలు - enforcement directorate
'ఇప్పటిదాకా ఎన్ని ఆర్థిక కుంభకోణాల కేసులను సరిగ్గా తేల్చారో మాకు చెప్పండి?'.. అంటూ సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్థిక కుంభకోణాల్లో కేసుల విచారణలు సీబీఐ, ఈడీ చేతికి వచ్చినప్పుడల్లా ఆలస్యమేనంటూ పలు వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం ఒడిశాకు చెందిన ఓ ఆర్థిక కుంభకోణంపై దాఖలైన పిటిషను విచారణ సందర్భంగా ఇలా నిలదీసింది. సీబీఐ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది రాతపూర్వక సమాధానం ఇచ్చేందుకు గడువు కోరినపుడు న్యాయమూర్తులు సీబీఐ, ఈడీలపై ఘాటుగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఒడిశాతోపాటు పశ్చిమబెంగాల్, త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో ఈ కుంభకోణం రూ.10 వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టినట్లు పిటిషనరు పినాక్ పాణి మొహంతి కోర్టు దృష్టికి తెచ్చారు.
"ఇది ప్రజల డబ్బు. మేము పదేళ్లు.. 20 ఏళ్లు.. 30 ఏళ్లు ఆగలేం. ఈ కుంభకోణానికి పాల్పడినవారు జైలులో ఉన్నా, ప్రజల డబ్బును అనుభవిస్తున్నారు. అదే డబ్బుతో ఈ కేసులో పోరాడుతున్నారు. ఇలాంటి కేసుల్లోని ప్రజాధనం ఎక్కడికి పోతోంది? వ్యక్తులు ఎవరైనా కావచ్చు. వాళ్లు లండన్, అమెరికా వంటి చోట్ల ఉండి ఈ డబ్బు అనుభవిస్తూ ఉండవచ్చు. ఇలాంటి వ్యవస్థను మార్చాలి" అని జస్టిస్ షా అన్నారు.