ఆయుష్, హోమియోపతి వైద్యులు కరోనా చికిత్సకు మందులు సూచించడం గానీ, వాటిని ప్రచారం చేయడం గానీ చేయకూడదని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఇటువంటి ప్రిస్క్రిప్షన్లను నిషేధిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అదే సమయంలో కొవిడ్ నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఆయుష్ వైద్యులకు కేంద్రం ఇచ్చిన సూచనలను కోర్టు సమర్థించింది. కేరళ హైకోర్టు ఆగస్టు 21న వెలువరించిన తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఆ ఉత్తర్వులను సవరించడానికి నిరాకరించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. డాక్టర్ ఏకేబీ సద్భావనా మిషన్ స్కూల్ ఆఫ్ హోమియోపతి ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
ఆయుష్, హోమియోపతి వైద్యులు కొవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వం ఆమోదించిన మాత్రలను రోగనిరోధక శక్తి పెంపొందించుకునేందుకు మాత్రమే సూచించవచ్చని.. చికిత్సలో భాగంగా ప్రిస్క్రైబ్ చేయొద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించిన విషయం తెలిసిందే.