ఓ మంత్రి చేసే ప్రకటనను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆపాదించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్రంపై ప్రజలకు ఆంక్షలు ఉండవని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించిన ఆంక్షలు మినహా.. వాక్ స్వాతంత్య్రంపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఐదుగురు న్యామమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ తీర్పును వెల్లడించింది.
భావ ప్రకటనపై సుప్రీం కీలక తీర్పు.. ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ఆంక్షలు కుదరవ్!
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారికి ప్రత్యేక ఆంక్షలేమీ విధించలేమని స్పష్టం చేసింది. ఓ మంత్రి చేసే ప్రకటనను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆపాదించలేమని సుప్రీం కోర్టు తెలిపింది.
జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం 4:1 మెజార్టీతో తీర్పును వెల్లడించింది. ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ప్రాథమిక హక్కును దేశంపై కాకుండా ఇతర వాటికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ బీవీ నాగరత్న భిన్నమైన తీర్పు ఇచ్చారు. అయితే.. ఆర్టికల్ 19లో నిబంధల మేరకు.. వాక్ స్వాతంత్ర్యంపై అధిక పరిమితి విధించలేమని అంగీకరించారు. ఒక మంత్రి తన అధికారిక హోదాలో అవమానకరమైన ప్రకటనలు చేసినట్లయితే, అలాంటి వాటిని ప్రభుత్వానికి ఆపాదించవచ్చని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని రక్షించడం కోసం మంత్రి చేసిన ప్రకటనను సమష్టి బాధ్యతగా చూడాలన్నారు జస్టిస్ నాగరత్న. సమాజాన్ని విభజించే ద్వేషపూరిత ప్రసంగం చేయడం.. విభిన్న నేపథ్యాలు కలిగిన పౌరులపై దాడి చేయడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది దేశ పునాదులను దెబ్బదీస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మనలాంటి దేశంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని జస్టిస్ నాగరత్న తెలిపారు. వాక్ స్వాతంత్య్రంపై, భావప్రకటనా స్వేచ్ఛ పౌరులకు చాలా అవసరమని, దీంతో పాలనపై పౌరులకు మంచి అవగాహన ఏర్పడుతుందని ఆమె తెలిపారు. ప్రజాప్రతినిధులకు స్వీయ నియంత్రణ అవసరమని.. జస్టిస్ నాగరత్న తీర్పులో ప్రస్తావించారు.
అత్యాచార బాధితులపై గతంలో ఉత్తర్‌ప్రదేశ్ మంత్రిగా పనిచేసిన ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పు ఇచ్చింది.