తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దిల్లీ అధికారాలు కేజ్రీవాల్​ సర్కార్​వే!'.. సుప్రీం కీలక తీర్పు - దిల్లీ పాలనా సర్వీసులపై నియంత్రణ తీర్పు

దిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణాధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో కేజ్రీవాల్ సర్కారుకు సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. ప్రభుత్వాధికారులపై ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

Delhi government vs LG
Delhi government vs LG

By

Published : May 11, 2023, 12:00 PM IST

Updated : May 11, 2023, 1:48 PM IST

దేశ రాజధాని దిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో కేంద్రానికి గట్టి షాక్‌ తగిలింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉండాలని స్పష్టం చేసింది. దిల్లీ సర్కారుకు అధికారాలు లేవన్న గత తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వాధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది.

"ప్రజాస్వామ్యం, ఫెడరల్‌ విధానాలు.. రాజ్యాంగ మూలస్వరూపంలోని భాగమే. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అసలైన అధికారాలు.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉండాలి. పాలనా వ్యవహారాలపై నియంత్రణ కూడా వారిదే. ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలకు ఎల్‌జీ కట్టుబడి ఉండాలి. అధికారులు మంత్రులకు నివేదించకపోతే.. వారి ఆదేశాలను పాటించకపోతే.. అప్పుడు సమగ్ర పాలనా విధానాలపై అది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దిల్లీ.. దేశంలోని ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా ఉండదు. దేశ రాజధాని అయినందున దీనికి ప్రత్యేక స్వరూపం ఉంది. ఇక్కడ పబ్లిక్‌ ఆర్డర్‌, భూమి, పోలీసు వ్యవస్థపై కార్యనిర్వాహక అధికారాలు కేంద్రానికే ఉంటాయి. అయితే, ఇతర రాష్ట్రాల మాదిరిగానే దిల్లీలోనూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. అందువల్ల పాలనా సర్వీసులపై అసలైన అధికారాలు ప్రజాప్రతినిధులతో కూడిన ప్రభుత్వానికే ఉంటాయి" అని ధర్మాసనం తేల్చి చెప్పింది.

దిల్లీలోని అన్ని పాలనా సర్వీసులపై కేంద్రానికే నియంత్రణ ఉంటుందంటూ 2015లో కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సానుకూల ఫలితం రాకపోవడం వల్ల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2019 ఫిబ్రవరి 14న ఈ వివాదంపై భిన్నాభిప్రాయ తీర్పును వెలువరించింది. పాలనా సర్వీసులపై దిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ చెప్పగా.. జస్టిస్‌ ఏకే సిక్రీ దాన్ని వ్యతిరేకించారు. దిల్లీలోని పాలనాధికారుల నియంత్రణకు సంబంధించిన శాసన, కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా, ఆ రాష్ట్ర ప్రభుత్వానిదా అనే వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నట్లు గతేడాది మే 6న సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం తోసిపుచ్చింది.

ఆప్​ హర్షం.. మంత్రులతో సమావేశం..
దిల్లీలో కేంద్రం- ఆప్​ ప్రభుత్వం మధ్య నెలకొన్న పాలనా వ్యవహారాల విషయంలో నియంత్రణ అధికారం వివాదంపై గురువారం సుప్రీం ఇచ్చిన తీర్పును ఆమ్​ ఆద్మీ స్వాగతించింది. తమ ప్రభుత్వానికి ఇది పెద్ద విజయం అని పేర్కొంది. ఈ క్రమంలో న్యాయస్థానం తీర్పుపై ముఖ్యమంత్రి సహా​ పార్టీలోని కొందరు ముఖ్య నేతలు స్పందించారు. "దిల్లీ ప్రజల కోసం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎనిమిదేళ్లుగా న్యాయ పోరాటం చేశారు. దీంతో నేడు ప్రజలే గెలిచారు" అని మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. "దిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీం కోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో అభివృద్ధి వేగం మరింతగా పుంజుకుంటుంది" అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. "ఈ తీర్పు దిల్లీ ప్రజలకు అనుకూలమైనది. చట్టానికి అనుగుణంగా వచ్చిన దీనిని నేను స్వాగతిస్తున్నాను. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన వైఖరి మరోసారి పునరావృతం కాదని ఆశిస్తున్నాము" అని ఆప్​ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అన్నారు. మరోవైపు సుప్రీం తాజా తీర్పుపై మంత్రులతో సమావేశం కానున్నారు కేజ్రీవాల్​.

Last Updated : May 11, 2023, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details