ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో విచారణ చేపడుతున్న 'ప్రత్యేక క్రిమినల్ కోర్టుల పరిధి' చట్ట ప్రకారమే ఉండాలనీ.. వీటి పరిధిని తాము నిర్ణయిస్తే చాలా తీవ్ర సమస్య ఉత్పన్నమవుతుందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది(supreme court on special courts). క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన చట్టసభ్యులపై జీవితకాల నిషేధం విధించాలని, వారిపై ఉన్న కేసుల విచారణను త్వరగా ముగించాలని కోరుతూ 2016లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్(samajwadi party azam khan) తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్(kapil sibal news) వాదనలు వినిపించారు.
"ఆజంఖాన్‌పై మేజిస్ట్రేట్ స్థాయిలో విచారించదగ్గ చిన్నపాటి ఆరోపణలున్నాయి. కానీ, వాటిపై సెషన్స్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక న్యాయస్థానంతో విచారణ జరిపిస్తున్నారు. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కంటే సెషన్స్ జడ్జి సీనియర్ అయినందున, ఆయా కేసుల్లో నిందితులు తమకు సహజంగా ఉండే అపీలు హక్కు కోల్పోతారా? కోర్టు స్థాయి పట్ల మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, ఇది చట్ట ప్రకారమో, లేదంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారమో ఉండాలి కదా?"