కరోనా నివారణకు సంప్రదాయ వైద్యమైన ఎర్ర చీమల పచ్చడిని(Ant Chutney) ఉపయోగించాలని సిఫార్సు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎర్రచీమలు, మిరపకాయలతో చేసిన పచ్చడిని జలుబు, దగ్గు, నీరసం, శ్వాస సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారని, కరోనా నివారణకు దీన్ని సిఫార్సు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఒడిశాకు చెందిన గిరిజనుడు నయాధర్ పఢియాల్ దావా వేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు దీన్ని సంప్రదాయ వైద్యంగా భావిస్తారని తెలిపారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ "చాలా రకాల సంప్రదాయ వైద్యాలు ఉన్నాయి. మన ఇంట్లోనూ(Home Remedies) కొన్నింటిని ఉపయోగిస్తుంటారు. దేశమంతటా దీన్ని అమలు చేయాలని అడగకూడదు" అని న్యాయమూర్తులు జస్టిస్ డీ.వై.చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.