SC Serious on TS High Court Orders: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకూ అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వులు చాలా దారుణం, ఏ మాత్రం ఆమోదయోగ్యం కావని వ్యాఖ్యానించారు. అవి అమల్లో ఉండటానికి వీల్లేదని, అందువల్ల స్టే ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కేసులో తదుపరి వాదనలు సోమవారం వింటామని, అంతవరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని పేర్కొన్నారు.
తన తండ్రి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకూ అరెస్ట్ చేయొద్దని హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల దర్యాప్తు పట్టాలు తప్పే ప్రమాదం ఏర్పడిందని, అందువల్ల ఆ ఉత్తర్వులను కొట్టేయాలని అభ్యర్థిస్తూ వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవేందర్‌పాల్‌సింగ్, అవినాష్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు.
దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు:సిద్ధార్థ లూథ్రా వాదనలు ప్రారంభించిన వెంటనే న్యాయమూర్తులిద్దరూ జోక్యం చేసుకుంటూ సునీతకు ఈ కేసుతో సంబంధమేంటని ప్రశ్నించారు. ఆమె హతుడి కుమార్తె అని సిద్ధార్థ లూథ్రా బదులిచ్చారు. ‘నా తండ్రి అత్యంత దారుణ హత్యకు గురయ్యారు. ఆయన భౌతికకాయం రక్తపు మడుగులో పడి ఉన్నా గుండెపోటుతో చనిపోయినట్లు ప్రచారం చేశారు. తీవ్ర కలత కలిగించేలా ఉన్న ఆ ఫొటోలను కేసుతోపాటు జత చేశాం. హత్య తర్వాత రక్తం, గాయాలు కనిపించకుండా ఆయన శరీరానికి కుట్లు వేసి, బ్యాండేజీతో చుట్టేశారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు తొలినాళ్లలో చాలా సమస్యలు వచ్చాయి. ఘటనలో ప్రమేయం ఉన్నవారు అప్రూవర్‌ను బెదిరించడంతో నిరుడు సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ చేసింది.
కేసు తెలంగాణకు వెళ్లిన తర్వాత వారు సీబీఐ దర్యాప్తు బృందంలోని ఒక సభ్యుడిపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు ఆ అధికారిపై కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. దాన్నుంచి ఉపశమనం కోసం ఆ అధికారి హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త దర్యాప్తు బృందం ఏర్పాటైంది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 30లోపు దర్యాప్తు పూర్తి చేయాలి. ఇటీవల అవినాష్‌రెడ్డి తండ్రి (వైఎస్ భాస్కరరెడ్డి), మరొక వ్యక్తి (గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి) అరెస్టయ్యారు. కారణమేదైనా ఈయనకు (అవినాష్‌రెడ్డికి) సీఆర్పీసీ 160 నోటీసులు మాత్రమే ఇచ్చారు. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం ఈయన పాత్ర గురించి స్పష్టంగా చెప్పారు.
సీబీఐ నోటీసులు జారీ చేసినప్పుడల్లా అవినాష్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తాను ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఆయన్ను విచారించాలని చెప్పి విచారణ ముగించింది. తాజాగా రెండోసారి హైకోర్టుకు వెళ్లినప్పుడు ఈ నెల 25 వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులిచ్చింది. ఇది చాలా సమస్యాత్మకంగా ఉంది. హైకోర్టు అవినాష్‌రెడ్డిని 19 నుంచి 25వ తేదీ వరకూ ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సీబీఐ ముందు విచారణకు హాజరుకావాలని చెబుతూనే వారి మధ్య జరిగే ప్రశ్నోత్తరాలన్నీ ముద్రితంగా/ లిఖితపూర్వంగా ఉండాలని చెప్పింది. సీబీఐ అడగదలచుకున్న ప్రశ్నల జాబితాను అవినాష్‌రెడ్డికి అప్పగించాలని ఆదేశించింది’ అని పేర్కొన్నారు.
వివేకాను అడ్డుతొలగించుకోవడానికే అంతమొందించారు:సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవేందర్‌పాల్‌సింగ్ వాదనలు వినిపిస్తూ ‘వివేకానందరెడ్డి కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎప్పుడూ పోటీ చేసేవారు. వివేకా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి చిన్నాన్న కావడంతో ఆయనకే ఎక్కువ ప్రభావం ఉండేది. వాళ్లు (అవినాష్‌రెడ్డి) ఎప్పుడూ బయట ఉండాల్సి వచ్చేది. అందువల్ల వివేకాను అంతమొందించడానికి ఆయన పట్ల ద్వేషం ఉన్న ముగ్గురిని ఎంచుకొని వారికి రూ.40 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ దుండగులు హత్యకు ముందు, తర్వాత అవినాష్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు టెలిఫోనిక్ సాక్ష్యాధారాల ద్వారా తేలింది. అవినాష్‌రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి ఈ హత్యను గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు.
ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అన్నీ వాళ్లనుకున్నట్లు జరిగితే భౌతికకాయాన్ని పాతిపెట్టేసేవాళ్లు. తర్వాత హత్య విషయం ఎప్పటికీ వెలుగుచూసి ఉండేది కాదు. వివేకా భౌతికకాయాన్ని ఇంట్లోనే ప్యాక్ చేసి బయటికి ఎలా తీసుకొచ్చారో కూడా ఫొటోలున్నాయి. కొందరు వ్యక్తులు అనుకోకుండా తమ ఫోన్లో ఫొటోలు తీసుకోవడం వల్ల ఆ విషయం వెలుగులోకి వచ్చింది. మీ వెనుక మేం ఉన్నాం, మీకేమీ జరగదు, నిర్భయంగా ఉండాలని నిందితులకు వీరు భరోసా ఇచ్చిన సాక్ష్యాధారాలు కూడా బయటికొచ్చాయి. ఈ కేసును గుండెపోటు మరణంగా నమోదు చేయాలని తనను బలవంతపెట్టినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ తొలుత వాంగ్మూలం ఇచ్చారు. తర్వాత ఆయన్ను సస్పెండ్ చేశారు’ అని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.