కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తీర్పునిచ్చిన సూరత్ జడ్జి సహా 68 మంది ప్రమోషన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ జ్యూడీషియల్ సర్వీస్ రూల్స్ 2005 ప్రకారం మెరిట్, సీనియారిటీ నిబంధనల మేరకే ప్రమోషన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. 68 మంది జిల్లా జడ్జీలకు ప్రమోషన్ ఇస్తూ గుజరాత్ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకమని, కోర్టు నిర్ణయానికి విరుద్ధమని బెంచ్ తెలిపింది. ప్రమోషన్లు పొందిన వారందరూ తిరిగి తమ పాత స్థానాలకు వెళ్లాలని ఆదేశించింది.
ఇదీ జరిగింది
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాఖలైన పరువునష్టం కేసును సూరత్ కోర్టు న్యాయమూర్తి హరీశ్ హస్‌ముఖ్‌భాయి వర్మ విచారించారు. అనంతరం రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ క్రమంలోనే ఇటీవల హెచ్‌హెచ్ వర్మతోపాటు మరో 68 న్యాయమూర్తులకు జిల్లా జడ్జి కేడర్‌కు పదోన్నతి దక్కింది. అయితే, వారి ప్రమోషన్‌ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సీనియర్ సివిల్ జడ్జి కేడర్‌కు చెందిన ఇద్దరు అధికారులు ఈ పదోన్నతులను సవాల్ చేశారు. 'మెరిట్- కమ్- సీనియారిటీ' ఆధారంగా కాకుండా.. 'సీనియారిటీ- కమ్- మెరిట్' ఆధారంగా నియామకాలు చేపట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ హైకోర్టు జారీ చేసిన సెలక్షన్ జాబితాను, వారిని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. అంతేకాకుండా, జ్యుడిషియల్ అధికారుల నియామకానికి సంబంధించి మెరిట్- కమ్- సీనియారిటీ ఆధారంగా కొత్త జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.