Supreme Court Nupur Sharma: మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి అంతర్జాతీయ స్థాయిలో దుమారానికి తెరలేపిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం దేశంలో జరిగిన పలు ఘటనలకు ఆమే బాధ్యురాలని న్యాయస్థానం మండిపడింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.
ఓ టీవీ ఛానల్‌లో డిబేట్ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే కాక, అంతర్జాతీయంగా కూడా తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో భాజపా.. ఆమెను సస్పెండ్ చేసింది. ఈ వ్యాఖ్యలకు గానూ ఆమెపై దేశంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఈ కేసులన్నింటినీ దిల్లీకి బదిలీ చేయాలంటూ నుపుర్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం నుపుర్ శర్మపై తీవ్రస్థాయిలో మండిపడింది.
"ఆమెకు ముప్పు ఉందా? లేదా ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చ అంతా చూశాం. ఆమె వ్యాఖ్యలు సిగ్గుచేటు. చీప్ పబ్లిసిటీనా లేక ఇదేమైనా కుట్రపూరితమా? ఆమె తన వ్యాఖ్యల ద్వారా దేశవ్యాప్తంగా ఎంతోమంది భావోద్వేగాలను రెచ్చగొట్టారు. ఆమె వ్యాఖ్యల అనంతరం దేశంలో దురదృష్టకర ఘటనలు జరిగాయి. ఉదయ్‌పుర్‌లో జరిగిన దారుణ ఘటనకూ ఆమే కారణం. ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయితే మాత్రం ఇష్టానుసారం మాట్లాడతారా? మీలాంటి వ్యక్తులకు ఏ మతంపైనా గౌరవం లేదు. తక్షణమే యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి. నుపుర్ శర్మ వ్యాఖ్యలు ఆమె అహంకారాన్ని తెలియజేస్తున్నాయి. ఆ కార్యక్రమం నిర్వహించిన ఛానల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది."
-- సుప్రీంకోర్టు