Judges Appointment : న్యాయమూర్తుల నియామకంలో జాప్యానికి కారణమేంటో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శికి ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం. కొలీజియం పేర్లు సిఫార్సు చేసినా.. హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్ని కేంద్రప్రభుత్వం చేపట్టకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడింది. ఆ పేర్లను ఉపసహరించుకునేలా చేసేందుకు ఈ జాప్యం ఓ సాధనంగా మారిందని వ్యాఖ్యానించింది. బెంగళూరు న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.
న్యాయమూర్తుల నియామకంలో జాప్యానికి గల కారణాలను తాము అర్థం చేసుకోలేకపోతున్నామని, అందుకే నియామకాల్లో జాప్యంపై కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
జస్టిస్ దీపాంకర్ దత్తా పేరును.. న్యాయమూర్తిగా కొలిజీయం సిఫార్సు చేసి ఐదు వారాలైనా కేంద్రం స్పందించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వికాశ్ సింగ్ అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. ఇందుకు.. కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలా నియామకాలు ఆలస్యం చేయడం వల్ల సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే కేంద్రం ధిక్కరించినట్లు అవుతుందని వికాశ్ సింగ్ పేర్కొన్నారు.
కొలీజియం తన సిఫార్సులను ఏకగ్రీవంగా అమోదిస్తే.. కేంద్రం మూడు-నాలుగు వారాల్లోగా న్యాయమూర్తులను నియమించాలని గతేడాది ఏప్రిల్‌లో ఇచ్చిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది.