తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జీవిత ఖైదు అంటే.. యావజ్జీవ కఠిన కారాగార శిక్షే!

జీవిత ఖైదు అంటే కఠినమైన జైలు శిక్ష అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై చట్టాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు ఇద్దరు ఖైదీల అభ్యర్ధనలను తోసిపుచ్చింది. మరో వ్యాజ్యంలో.. 20ఏళ్లు విడిగా ఉంటున్న దంపతులను కలిసి ఉండాలని నచ్చజెప్పడంలో అర్థం లేదని అభిప్రాయపడింది.

supreme court
supreme court

By

Published : Sep 15, 2021, 7:50 AM IST

జీవిత ఖైదు అంటే సాధారణ జైలుశిక్ష కాదని, యావజ్జీవ కఠిన కారాగార శిక్ష అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. హత్య కేసుల్లో దోషులుగా తేలిన మహమ్మద్‌ అఫ్జల్‌ అలీ, రాకేశ్‌ కుమార్‌లు.. తమకు న్యాయస్థానాలు విధించిన జీవిత ఖైదును 'కఠిన జీవిత ఖైదు'గా పరిగణించాలా? అని ప్రశ్నిస్తూ రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

'ఇరవై ఏళ్ల దూరంతో బంధం తెగిపోయినట్టే..'

రెండు దశాబ్దాల పాటు విడివిడిగా ఉంటున్నారంటే వారి వివాహ బంధం తెగిపోయినట్టేనని, కలిసి ఉండాలంటూ నచ్చజెప్పడంలో అర్థంలేదని మరొక వ్యాజ్యంపై.. మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని 142 అధికరణం కింద సంక్రమించిన ప్రత్యేక అధికారం ద్వారా వారి వివాహాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. భార్యకు మనోవర్తి కింద ఎనిమిది రోజుల్లోగా రూ.25 లక్షలు ఏకమొత్తంలో చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులోని మంచిచెడ్డలను పరిశీలించాల్సిన పనిలేకుండానే వారి మధ్య వివాహబంధం మానసికంగా తెగిపోయినట్టుగా పరిగణించవచ్చని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ పోలీసు అధికారి 1997లో ప్రత్యేక వివాహ చట్టం కింద రిజిస్టర్‌ పెళ్లి చేసుకున్నారు. 2000లో హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా మరోసారి వివాహం చేసుకున్నారు. భార్య తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తోందని, విడిచిపెట్టి వెళ్లిపోయిందని ఆరోపిస్తూ 2007లో తొలుత జిల్లా కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి వారు విడివిడిగానే ఉండడంతో ధర్మాసనం ఆ వివాహాన్ని రద్దు చేసింది.

పదోన్నతుల్లో రిజర్వేషన్లపై అస్పష్టత తొలగించాలి..

పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై అస్పష్టతను తొలగించాలని మంగళవారం.. కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును కోరాయి. ఇందుకు సంబంధించిన 133 వ్యాజ్యాలపై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. స్పష్టత లేని కారణంగా చాలా నియామకాలు ఆగిపోతున్నాయని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ తెలిపారు. హైకోర్టులు మూడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా అవి వేరువేరుగా ఉన్నాయని చెప్పారు. పదోన్నతులకు క్రిమీలేయర్‌ వర్తిస్తుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు లేవని కొందరు న్యాయవాదులు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పాత కేసులను తిరిగి తెరవబోమని తెలిపింది. ఎలా అమలు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్రాల వారీగా ఏవైనా ప్రత్యేక సమస్యలు ఉంటే రెండు వారాల్లో వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు అయిదో తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details