సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్ల కల్పనకే రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితం కాకుండా మరెన్నో చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆయా వర్గాల్లో చదువులను ప్రోత్సహించడం, విద్యా సంస్థలను నెలకొల్పడం వంటివి చేయవచ్చని తెలిపింది. మహారాష్ట్రలో మరాఠాలకు ప్రత్యేక కోటాకు సంబంధించిన వ్యాజ్యంపై అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా.. కొన్ని ప్రశ్నలను సంధించింది. జస్టిస్ అశోక్‌భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ హేమంత్ గుప్త, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ సభ్యులుగా ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణ కొనసాగింది.
ఝార్ఖండ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. విద్యా సంస్థలను విరివిగా నెలకొల్పడం, అధ్యాపకుల నియామకం అన్నది రాష్ట్రాల ఆర్థిక వనరుల అంశంతో ముడిపడి ఉంటుందన్నారు. రాష్ట్ర జనాభాను అనుసరించి రిజర్వేషన్ల విస్తృతి మారుతుందని, అన్నిటికీ ఏక సూత్రం వర్తించబోదని తెలిపారు.