దంపతులిద్దరూ విషం తాగిన సందర్భంలో (Drinking Poison) ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ భర్తకు శిక్ష విధించడం సరికాదని మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు చెప్పింది. ఆత్మహత్య చేసుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితులు కల్పించినప్పుడే.. ప్రేరేపించారని భావించి శిక్ష వేయాల్సి ఉంటుందని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచ్చింది.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే తమిళనాడుకు (Tamil nadu) చెందిన వేలుదురైకు వివాహం జరిగి 25 ఏళ్లు కాగా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య గొడవ జరగగా, అనంతరం ఇద్దరూ పురుగుమందు తాగారు. ఆమె చనిపోగా, ఆయన బతికాడు. దాంతో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ ఆయనకు సెక్షన్ 306 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు కూడా ఇందుకు ఆమోదించింది.