తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిసోదియాకు సుప్రీంకోర్టులో నిరాశ.. బెయిల్​ పిటిషన్​పై విచారణకు నో - దిల్లీ లిక్కర్​ స్కామ్​ తాజా వార్తలు

దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాకు సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్​పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.

Manish Sisodia Appeal Supreme Court
సుప్రీంను ఆశ్రయించిన మనీశ్​ సిసోదియా

By

Published : Feb 28, 2023, 5:09 PM IST

Updated : Feb 28, 2023, 6:11 PM IST

దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాకు సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్​పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.
లిక్కర్ స్కామ్​లో కేసులో ఈ నెల 26న ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ, ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ న్యాయవాదులు మంగళవారం ఉదయం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ వ్యాజ్యాన్ని అత్యవసరమైనదిగా పరిగణించి, భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. సిసోదియా పిటిషన్​ను మంగళవారం సాయంత్రం పరిశీలించింది. బెయిల్ పిటిషన్​పై విచారణ చేపట్టేందుకు నిరాకరించింది.

"దిల్లీలో కుంభకోణం​ జరిగినంత మాత్రాన మమ్మల్ని ఆశ్రయించడం సరికాదు.సెక్షన్​ 482 ప్రకారం సిసోదియా ఎఫ్​ఐఆర్​ను రద్దు చేయడానికి సీఆర్​పీసీ(కోడ్ ఆఫ్​ క్రిమినల్​ ప్రొసీజర్​​) కింద అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. బెయిల్​ కోసం కింది స్థాయి కోర్టులను కూడా సంప్రదించవచ్చు. ఈ కేసులో న్యాయస్థానం జోక్యం చేసుకోబోదు. అదే జరిగితే కోర్టు నుంచి సమాజానికి తప్పుడు సంకేతాలు అందుతాయి."
--సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని పలు అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని సీజేఐ తెలిపారు. మొత్తంగా ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించడం ఉత్తమం అని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇదీ కేసు..
దిల్లీ​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 నూతన మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని గతేడాది జులైలో పెద్దఎత్తున ఆరోపణలు గుప్పుమన్నాయి. నిబంధనల ఉల్లంఘన సహా విధానపరమైన లోపాలతో ఈ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి అప్పట్లో నివేదిక ఇచ్చారు. కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చేలా టెండర్ల విధానంలో మార్పులు చేశారని పేర్కొన్నారు. అబ్కారీ శాఖ ఇన్​ఛార్జ్​ మంత్రిగా ఉన్న మనీశ్​ సిసోదియా పేరునూ ఇందులో చేర్చారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్​ కుమార్​ సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐకి గతంలో సిఫార్సు చేశారు. దీంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఈ కేసులో పలువురు నేతలతో పాటు దిల్లీ ఉపముఖ్యమంత్రిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. చివరకు ఈ ఎక్సైజ్​ నూతన పాలసీ విధానాన్ని ఆప్​ సర్కార్ వెనక్కి తీసుకుంది.

మద్యం కుంభకోణం కేసులో మనీశ్​ సిసోదియాకు ఈనెల 26న సీబీఐ సమన్లు జారీ చేసింది. దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం ఆయన్ను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. మరుసటి రోజు సిసోదియాను కేంద్ర దర్యాప్తు సంస్థ.. కోర్టులో ప్రవేశపెట్టింది. విచారణ కోసం ఆయన్ను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. న్యాయస్థానం ఇందుకు సానుకూలంగా స్పందించింది. మార్చి 4 వరకు మనీశ్​ను విచారించేందుకు సీబీఐకి అనుమతనిచ్చింది. బెయిల్ కోసం మంగళవారం సిసోదియా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నిరాశే మిగిలింది.

Last Updated : Feb 28, 2023, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details