Rajiv Gandhi Assassination Convict: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరికి ఊరటను కల్పించింది సుప్రీంకోర్టు. 30 ఏళ్లకుపైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్‌ను విడుదల చేయాలని జస్టిస్ ఎల్ నాగేశ్వర రావ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో తన జీవిత ఖైదును సస్పెండ్ చేయాలని కోరుతూ 47 ఏళ్ల పెరారివాలన్ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
పెరారివాలన్‌కు ఉపశమనం కల్పించేందుకు.. సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాన్ని ఉపయోగించింది. సంబంధిత పరిశీలనల ఆధారంగా తమిళనాడు మంత్రివర్గం తన నిర్ణయం తీసుకుందని.. ఆర్టికల్ 142 ప్రకారం దోషిని విడుదల చేయడం సముచితమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు ఎటువంటి ఫిర్యాదుల చరిత్ర లేకపోవడం సహా సుదీర్ఘమైన జైలు శిక్షను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం మార్చి 9న పెరారివాలన్‌కు.. బెయిల్ మంజూరు చేసింది.
కుటుంబసభ్యుల భావోద్వేగం: సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే పెరారివాలన్ సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు భావోద్వేగానికి గురయ్యారు. పెరారివాలన్ నివాసానికి చేరుకున్న సన్నిహితులు సంబరాలు చేసుకున్నారు. పెరారివాలన్ తన తల్లి అర్పుతమ్మాళ్‌కు మిఠాయి తినిపించారు. తన కుమారుడి 30 ఏళ్ల జైలు శిక్ష ముగియడం పట్ల పెరారివాలన్ తండ్రి కుయిల్‌దాసన్ సంతోషం వ్యక్తం చేశారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తమిళ అనుకూల సంఘాల కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైకో, పీఎంకే నేత రామదాస్ సహా రాజకీయ నేతలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు.