Supreme Court On TDP leaders Bail : సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. అంగళ్లు కేసులో కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీం తిరస్కరించింది. టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన 6 వేర్వేరు పిటిషన్లు కొట్టివేసింది.
పుంగనూరు, అంగళ్లు కేసులోటీడీపీ నేతలకు గత నెల 21న ఏపీ హైకోర్టు బెయిల్మంజూరు చేసింది. దాదాపు 79 మందికి బెయిల్ మంజూరు చేస్తూ.. వారంతా ప్రతి మంగళవారం పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీ రామ్‌భూపాల్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇవే కేసుల్లో ముందస్తుగా మరో 30 మంది టీడీపీ నేతలు బెయిల్ పిటిషన్ (Bail Petition) వేయగా.. తదుపరి విచారణ వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. బెయిల్ మంజూరైన టీడీపీకి చెందిన నేతలు 79 మంది ప్రస్తుతం చిత్తూరు, మదనపల్లె, కడప జైళ్లలో ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై కొనసాగిస్తున్న విధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబు(TDP leader Chandrababu) యుద్ధభేరి చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. టీడీపీ అధినేత ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chittoor District)లో పర్యటించారు. జిల్లాలోని పుంగనూరు బయల్దేరగా.. అంగళ్లు వద్ద చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో దాడులకు ఆజ్యం పోశారు. టీడీపీ శ్రేణులను అడ్డుకోవటమే కాకుండా మరింత రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు... రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలపై దాడి చేశారు. ఈ దాడిలో చాలా మంది టీడీపీ నేతలు తీవ్రంగా గాయపడగా.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. మరోవైపు చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు కూడా ఆయన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఓ వైపు పోలీసులు అడ్డుపడగా.. మరోవైపు టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు చించివేయటంతో మరింత ఉద్రిక్తత నెలకొంది.